న్యూఢిల్లీ: సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షా ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఈ ఏడాది 85 శాతానికిపైగా విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారని సీనియర్ అధికారి ఒకరు ప్రకటించారు. గత ఏడాదితో పోలిస్తే ఉత్తీర్ణత శాతం మూడు శాతానికిపైగా తగ్గిందని ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఏడాది కూడా పరీక్షల్లో బాలికలదే పైచేయిగా నిలిచింది.
బాలికల్లో ఉత్తీర్ణత శాతం 88.86 శాతం కాగా, బాలుర ఉత్తీర్ణత శాతం 82.13గా నమోదైంది. విద్యార్థుల్లో 94,028 మంది (5.32శాతం) 90 శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించగా, 17,113 మంది విద్యార్థులు 95 శాతం లేదా అంతకన్నా ఎక్కువ మార్కులు సాధించారు. 2025లో 1,29,095 ‘కంపార్ట్మెంట్’లో పాస్ కాగా, ఈసారి ఆ సంఖ్య 1,63,800కి పెరిగింది. బోర్డు పరీక్షల్లో ఒకటి లేదా రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయిన విద్యార్థులను ‘కంపార్ట్మెంట్’గా పేర్కొంటారు.