Manipur Horror | న్యూఢిల్లీ: మణిపూర్‌లో ఒక మూక ఇద్దరు మహిళలపై లైంగిక దాడి చేసి, వారిని నగ్నంగా ఊరేగించిన దారుణ ఘటనకు సంబంధించిన కేసును సీబీఐ దర్యాప్తు చేస్తుందని ఒక ఉన్నతాధికారి తెలిపారు. మణిపూర్‌లో చోటుచేసుకున్న హింసాకాండలో ఇలాంటి దారుణాలకు పాల్పడిన వారు ఎంతటివారైనా చర్య తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
మహిళల నగ్న ఊరేగింపును చిత్రీకరించిన వ్యక్తిని అరెస్ట్ చేసి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి మణిపూర్ రాష్ట్రం వెలుపల విచారణ జరపాలని కేంద్రం శుక్రవారం సుప్రీం కోర్టును కోరింది.
హింసపై మరో పిటిషన్..
మణిపూర్‌లో వెలుగు చూసిన మహిళలపై లైంగిక వేధింపులు, హింసపై రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జీతో స్వతంత్ర విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని అడ్వొకేట్ విశాల్ తివారీ గురువారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే ఈ అంశంపై కొన్ని పిటిషన్లు దాఖలయ్యాయని.. శుక్రవారం వాటిని విచారిస్తామని కోర్టు తెలిపింది. సీజేఐ చంద్రచూడ్ గురువారం కోర్టుకు రాలేదని.. కాబట్టి శుక్రవారం పిటిషన్‌ను ఆయనకే సమర్పించాలని తివారీకి సూచించింది.