UGC NET exam | దేశవ్యాప్తంగా నిర్వహించిన జీసీ-నెట్ (యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్-జాతీయ అర్హత పరీక్ష)లో అక్రమాలు జరిగినట్లు నివేదికలు రావడంతో ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTS) బుధవారం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త తేదీలను ప్రకటించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ (Ministry of Education) అధికారులు గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ పరీక్షపై తమకు ఎలాంటి ఫిర్యాదులూ అందలేదన్నారు. అయితే, విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని సుమోటోగా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ అంశంపై సీబీఐ దర్యాప్తు చేపడుతోందని.. బాధ్యులు ఎవరైనా సరే కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ జాయింట్ సెక్రటరీ గోవింద్ జైశ్వాల్ (Govind Jaiswal) తెలిపారు.
ఓవైపు నీట్ యూజీ-2024 (UGC NET exam) పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ అయిందని, పలు అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న వేళ మరో సంచలన పరిణామం చోటుచేసుకొన్నది. యూజీసీ-నెట్ పరీక్షను జూన్ 18 మంగళవారం దేశవ్యాప్తంగా 317 నగరాల్లోని 1205 సెంటర్లలో నిర్వహించారు. ఓఎంఆర్(పెన్, పేపర్) విధానంలో నిర్వహించిన ఈ పరీక్షకు 9 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు. అయితే, పరీక్ష సమగ్రత దెబ్బతిన్నట్టు కేంద్ర హోంశాఖ పరిధిలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్కి(ఐ4సీ) చెందిన నేషనల్ సైబర్ క్రైమ్ థ్రెట్ అనలటిక్స్ యూనిట్ నుంచి యూజీసీకి సమాచారం వచ్చింది. దీంతో ఈ పరీక్షను రద్దు చేస్తున్నట్లు ఎన్టీఏ బుధవారం వెల్లడించింది. పరీక్ష ప్రక్రియ ఉన్నత స్థాయి పారదర్శకత, పవిత్రతను కాపాడేందుకు యూజీసీ నెట్ పరీక్షను రద్దు చేసేందుకు కేంద్ర విద్యా శాఖ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
Also Read..
Vande Bharat | వందే భారత్ ఆహారంలో బొద్దింక.. షాకైన జంట
Bengal Governor | రాజ్భవన్లో నాకు భద్రత లేదు.. బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ సంచలన వ్యాఖ్యలు
IIT Bombay | రామాయణాన్ని కించపరుస్తూ స్కిట్.. విద్యార్థులకు రూ.1.2లక్షల ఫైన్ వేసిన ఐఐటీ బాంబే