NEET | నీట్ యూజీ పేపర్ లీకేజీ వివాదాల నేపథ్యంలో సీబీఐ రంగంలోకి దిగింది. నీట్ నిర్వహణలో అవకతవకలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నీట్ వ్యవహారంపై విచారణ మొదలుపెట్టిన సీబీఐ.. బిహార్‌లో జరిగిన పేపర్ లీక్‌తో పాటు గ్రేస్ మార్కుల వ్యవహారంపై దర్యాప్తును వేగవంతం చేసింది.
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారాలపై విమర్శలు వెల్లువెత్తుతుండటంతో కేంద్ర ప్రభుత్వం శనివారం కీలక నిర్ణయాలు తీసుకుంది. మొదటగా నీట్ పరీక్షను నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీయే ) ప్రక్షాళనకు ఉన్నతస్థాయి కమిటీని వేసింది. ఆ తర్వాత ఎన్టీయే డైరెక్టర్ జనరల్ సుబోధ్ సింగ్‌ను పదవి నుంచి తొలగించింది. ప్రస్తుతం ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్(ఐటీపీఓ) చైర్మన్, ఎండీగా ఉన్న ప్రదీప్ సింగ్ ఖరోలాకు ఎన్టీఏ డైరెక్టర్ జనరల్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ క్రమంలోనే నీట్ లీక్ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగిస్తూ శనివారం రాత్రి కీలక నిర్ణయం తీసుకుంది. లీక్ మూలాలను తేల్చేందుకు సమగ్ర దర్యాప్తు కోసమే ఈ కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.