CBI – ED | సిమ్లాలో విధులు నిర్వర్తిస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అసిస్టెంట్ డైరెక్టర్ మీద కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) మరో కేసు నమోదు చేసింది. హిమాచల్ ప్రదేశ్ లోని విద్యా సంస్థల ప్రమోటర్ల నుంచి రూ.85 లక్షలు, రూ.80 లక్షల లంచం అడిగినట్లు సదరు ఈడీ సహాయ డైరెక్టర్ మీద అభియోగాలు నమోదయ్యాయి. సీబీఐ గత వారం నిర్వహించిన ట్రాప్ ఆపరేషన్ నుంచి తప్పించుకున్నాడు. లంచం ఇవ్వజూపిన విద్యా సంస్థల ప్రమోటర్లు మీడియాతో మాట్లాడుతూ తమను ఈడీ ఆఫీసుకు పిలిపించి వేధించారని చెప్పారు. ఈ విషయమై వారు సీబీఐకి ఫిర్యాదు చేశారు. ఈడీ సహాయ డైరెక్టర్‌తోపాటు మరో ఇద్దరు ఆయన సిబ్బంది.. తమను ఆఫీసులో కూర్చుండబెట్టి వేధింపులకు పాల్పడే వారని ఆరోపించారు.
ఇదిలా ఉంటే ఈ కేసులో మరో ముగ్గురు అనుమానితుల పాత్ర ఉంటుందని సీబీఐ అనుమానిస్తున్నది. వారిలో ఒకరు నిందితుడి సోదరుడు, మరొకరు మధ్యవర్తి ఉన్నారు. వారిద్దరూ సీబీఐ కస్టడీలో ఉన్నారు. ఈడీ సహాయ డైరెక్టర్ మాత్రం సీబీఐ విచారణకు హాజరు కాలేదు.
ఈడీ సహాయ డైరెక్టర్ సోదరుడు – పంజాబ్ నేషనల్ బ్యాంక్ సీనియర్ మేనేజర్.. చండీగఢ్‌లోని ఓ నిర్దేశిత ప్రదేశానికి వెళ్లి.. సంబంధిత విద్యా సంస్థల ప్రమోటర్ల నుంచి డబ్బు తీసుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి. దీంతో పీఎన్బీ మేనేజర్ మీద మనీ లాండరింగ్ కేసు నమోదు కానున్నది. కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు నుంచి డిప్యుటేషన్‌పై సదరు ఈడీ సహాయ డైరెక్టర్‌ను సిమ్లాలో నియమించారు. తాజా అభియోగాల నేపథ్యంలో ఈడీ సహాయ డైరెక్టర్, ఆయన ఆధీనంలోని డిప్యూటీ డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్ లను ఢిల్లీకి బదిలీ చేసినట్లు ఈడీ వర్గాలు తెలిపాయి.