న్యూఢిల్లీ, మార్చి 27: జాతీయ భద్రత, సమగ్రతలకు విఘాతం కలిగించే కేసులలో రాష్ట్రాల అనుమతి అవసరం లేకుండానే సీబీఐ దర్యాప్తు చేసేలా అధికారాలను కల్పించే ఓ ప్రత్యేక చట్టాన్ని చేయాలని పార్లమెంటరీ కమిటీ కేంద్రానికి సిఫార్సు చేసింది. తెలంగాణ, కర్ణాటక, జార్ఖండ్, తమిళనాడు, పంజాబ్ సహా బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న ఎనిమిది రాష్ట్రాలు సీబీఐ దర్యాప్తులకు అనుమతిని(జనరల్ కన్సెంట్) ఉపసంహరించుకున్న దరిమిలా అవినీతి, వ్యవస్థీకృత నేరాలను దర్యాప్తు చేయడం ఆ రాష్ర్టాలలో కేంద్ర దర్యాప్తు సంస్థకు అడ్డంకిగా మారింది.
ఈ నేపథ్యంలో రాష్ర్టాల అనుమతి లేకుండా సీబీఐ దర్యాప్తు చేసేందుకు వీలు కల్పించే విధంగా కొత్త చట్టాన్ని రూపొందించాలని పార్లమెంటరీ కమిటీ సిఫార్సు చేసింది. కమిటీ నివేదికను గురువారం ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టింది.