న్యూఢిల్లీ, అక్టోబర్ 29: ‘ప్రజా జీవితంలోకి రావడం, మంత్రి అవడమే నా తప్పు అయింది. లేకుంటే నాపై ఎలాంటి కేసులు ఉండేవి కావు’ అని ఆప్ నేత, ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ కోర్టులో శుక్రవారం తన బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సత్యేందర్ జైన్ న్యాయవాది ఎన్ హరిహరన్ వాదనలు వినిపించారు. కేసు విచారణ దశలో ఉన్నదని మొదటి బెయిల్ పిటిషన్‌ను రద్దు చేశారని గుర్తుచేసిన న్యాయవాది, సత్యేందర్ జైన్ సాక్షులను ప్రభావితం చేస్తారన్న ఈడీ వాదనలు దారుణమని పేర్కొన్నారు. ఈడీ వాదనలు వినేందుకు కోర్టు విచారణను నవంబర్ 5కు వాయిదా వేసింది. మనీలాండరింగ్ ఆరోపణలతో జైన్‌ను ఈడీ మే 30న అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన తీహార్ జైల్లో ఉన్నారు.