ప్రతిపక్ష పార్టీల నాయకుల మీద రాజకీయ ప్రతీకార దాడుల కోసం గడిచిన తొమ్మిదేండ్లలో బీజేపీ అనుసరిస్తున్న ఫార్ములా ఇది.
(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ): 2014 నుంచి ఇప్పటివరకు ఈడీ, సీబీఐ ఫైల్ చేసిన కేసుల్లో 95 శాతం ప్రతిపక్ష నాయకులు, వారి బంధువుల మీదే నమోదయ్యాయి. ఇందులో 0.46 శాతం కేసులే రుజువయ్యాయి. ప్రతిపక్ష నాయకులను ప్రజాక్షేత్రంలో దెబ్బతీయడానికి, రాజకీయంగా కుంగదీయగడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఈ కేసులను నమోదు చేస్తున్నట్టు అర్థమవుతున్నది. అప్పటివరకు కేసులు, దర్యాప్తు సంస్థల విచారణను ఎదుర్కొన్న నేతలు.. బీజేపీ తీర్థం పుచ్చుకోగానే సచ్చీలురుగా మారుతారు. అప్పటివరకూ దూకుడుగా వ్యవహరించిన ఈడీ, సీబీఐ హఠాత్తుగా కనిపించకుండాపోతాయి.
తొమ్మిదేండ్ల పాలనలో విపక్షాలపై బీజేపీ కక్షసాధింపులు ఇలా..
1. నారాయణ్ రాణె: మనీలాండరింగ్ కేసులో ఈడీ వేటాడింది. 2017లో బీజేపీకి అనుబంధంగా సొంత పార్టీ పెట్టుకోవడంతో దాడులు ఆగాయి. కేంద్రమంత్రయ్యారు. 2019లో పార్టీని బీజేపీలో విలీనం చేశారు.
2. సువేందు అధికారి: పశ్చిమబెంగాల్‌కు చెందిన టీఎంసీ నేత. శారద మల్టీలెవల్ మార్కెటింగ్ కుంభకోణంలో 2014 నుంచి సీబీఐ పలుమార్లు ప్రశ్నించింది. 2020లో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటినుంచీ విచారణ బంద్.
3. హిమంత బిశ్వశర్మ: శారద కుంభకోణంలో నిందితుడు. 2014 నవంబర్‌లో సీబీఐ ఆయన ఇంటిపై దాడులు చేసింది. 2015 ఆగస్టులో బీజేపీలో చేరారు. ఏకంగా అస్సాం సీఎం అయ్యారు.
4. ముకుల్ రాయ్: 2014లో బెంగాల్లో లంచాలు తీసుకోవటంపై సంచలనం సృష్టించిన శారద కేసులో నిందితుడు. సీబీఐ పలుమార్లు నోటీసులు ఇవ్వడంతో 2017లో బీజేపీలో చేరారు. విచారణ ఆగింది. పైగా 2021 మేలో ముకుల్‌రాయ్‌కి క్లీన్ చిట్ ఇచ్చింది. ఆ వెంటనే ఆయన మళ్లీ తృణమూల్‌లో చేరారు.
5. జ్యోతిరాదిత్య సింధియా: కాంగ్రెస్‌కు చెందిన జ్యోతిరాదిత్య సింధియాపై భూ ఆక్రమణ కేసులు నమోదయ్యాయి. 2020 మార్చి 10న ఆయన బీజేపీలో చేరగానే మధ్యప్రదేశ్ ఎకనామిక్స్ అఫెన్స్ వింగ్ ఈ కేసును మూసివేసింది.
6. భావన గవ్లీ: మహారాష్ట్రలోని ఠాక్రే శివసేనలో ఉన్నప్పుడు ఈడీ ఐదుసార్లు నోటీసులిచ్చింది. ఇప్పుడు ఏక్నాథ్ షిండే వర్గం శివసేన ఎంపీగా ఉన్నారు. పార్టీకి చీఫ్‌విప్‌గా కొనసాగుతున్నారు. ఈడీ కేసులు మరుగునపడ్డాయి.
7. యశ్వంత్ జాదవ్: యశ్వంత్ జాదవ్, ఆయన సతీమణి యామినీ జాదవ్‌పై ఫెమా ఉల్లంఘనల కింద ఈడీ కేసులు పెట్టింది. షిండే వర్గంలో చేరగానే ఆ కేసులు అటకెక్కాయి.
8. ప్రతాప్ సర్నాయక్: శివసేనలో ఉన్నప్పుడు మనీలాండరింగ్ ఆరోపణలతో ఈడీ కేసు నమోదు చేసింది. షిండే సేనలోకి రాగానే, కేసు ఊసేలేకుండా పోయింది.
9. సుజనా చౌదరి: టీడీపీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి సుజనాచౌదరి ఇండ్లు, కంపెనీలపై 2018 నవంబర్‌లో ఈడీ, 2019 జూన్ 2న సీబీఐ దాడులు జరిగాయి. ఆయన వెంటనే ఢిల్లీ వెళ్లి జూన్ 20న బీజేపీలో చేరారు. ఆ తర్వాత దాడులు ఆగిపోయాయి.
10. సీఎం రమేశ్: టీడీపీకి చెందిన సీఎం రమేశ్‌పై 2018 అక్టోబర్‌లో ఐటీ, 2019 ఏప్రిల్‌లో ఈడీ దాడులు జరిగాయి. ఆయన కూడా సుజనా చౌదరితో కలిసి జూన్ 20న బీజేపీలో చేరారు. ఆ రోజు నుంచే దాడులు ఆగాయి.
సీబీఐ కేసులు ఎదుర్కొంటున్న ప్రముఖ విపక్ష నాయకులు
1. కాంగ్రెస్: కార్తీ చిదంబరం, డీకే శివకుమార్
2. ఆర్జేడీ: లాలూ ప్రసాద్ యాదవ్
3. బీఎస్పీ: మాయావతి
4. ఎస్పీ: ఆజంఖాన్
5. ఎన్సీపీ: అనిల్ దేశ్‌ముఖ్
6. తృణమూల్: అభిషేక్ బెనర్జీ, పార్ధ చటర్జీ
7. ఆప్: మనీశ్ సిసోడియా