పాట్నా, జూలై 25: ‘లంచం సొమ్ము తిని తెగబలిసాడు’ అంటూ అవినీతి ఉద్యోగులను ఉద్దేశించి విమర్శలు చేయడం కద్దు. అయితే లంచం తీసుకుంటూ పట్టుబడిన ఒక ఉద్యోగి సాక్షాత్తు ఆ సొమ్మును నోట్లో వేసుకుని నమిలి మింగి అధికారులను నిశ్చేష్టులను చేసిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. కట్ని జిల్లా రెవెన్యూ శాఖలో పట్వారీగా పనిచేస్తున్న గజేంద్ర సింగ్ ఒక భూమి వివాదం పరిష్కరించడానికి చందన్ సింగ్‌ను రూ.5వేలు లంచం అడిగాడు. అతడు జబల్పూర్లోని లోకాయుక్తకు ఫిర్యాదు చేయడంతో వారు రంగంలోకి దిగారు.
ఒక ప్రైవేట్ కార్యాలయంలో రూ.4,500 లంచం తీసుకుంటుండగా గజేంద్ర సింగ్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతడిని అరెస్ట్ చేస్తుండగా, వారికి ఎలాంటి ఆధారాలు చిక్కకూడదని హఠాత్తుగా గజేంద్ర సింగ్ తాను తీసుకున్న కరెన్సీని నోట్లో వేసుకుని నమిలి మింగాడు. అతడి చర్యకు లోకాయుక్త అధికారులు నివ్వెరపోయారు. తర్వాత అతడిని జిల్లా దవాఖానకు తీసుకుపోయి చాలాసేపు ప్రయత్నించిన తర్వాత నోట్ల గుజ్జును అతని నోటినుంచి కక్కించారు. నిందితుడు లంచం సొమ్ము నమిలి మింగుతున్న దృశ్యం వైరల్‌గా మారింది. గజేంద్ర సింగ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్పీ సంజయ్ సాహు తెలిపారు.