న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల (Delhi Elections) కోసం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది. కుల గణన, పూర్వాంచలీలకు మంత్రిత్వ శాఖ, ప్రతి మహిళకు నెలకు రూ.2,500, 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ వంటి హామీలను అందులో ప్రకటించింది. 22 అంశాలుగా విభజించిన హామీల మేనిఫెస్టోను ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్ బుధవారం విడుదల చేశారు. కాంగ్రెస్ కమ్యూనికేషన్ల ఇంచార్జ్ జైరామ్ రమేష్, ఇతర నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కాగా, రూ.25 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా, ఉచిత రేషన్ వంటి హామీలను ఈ మేనిఫెస్టోలో పొందుపర్చారు. విద్యావంతులైన నిరుద్యోగ యువతకు నెలకు రూ.8,500 చొప్పున ఏడాది పాటు ఆర్థిక సహాయాన్ని కూడా ప్రకటించారు. వంద ఇందిరమ్మ క్యాంటీన్ల ఏర్పాటు ద్వారా రూ.5కే భోజనం అందిస్తామని పేర్కొన్నారు.
మరోవైపు ఢిల్లీలో కాలుష్యం, కలుషిత యమునా నదీ సమస్యల పరిష్కారాన్ని ఆ మేనిఫెస్టోలో ప్రస్తావించారు. కేంద్రంలోని బీజేపీ, ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్ ఈ సమస్యల పరిష్కారంలో విఫలమైనట్లు ఒంటరిగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ ఆరోపించింది. కాగా, ఫిబ్రవరి 5న ఢిల్లీలో పోలింగ్ జరుగనున్నది. ఫిబ్రవరి 8న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు.