Covid JN.1 | కరోనా మహమ్మారి శాంతించడంతో దేశవ్యాప్తంగా అందరూ ఊపిరిపీల్చుకుంటున్నారు. అంతా సర్దుకుంటుందనుకుంటున్న తరుణంలో మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా కేరళ కొవిడ్ సబ్ వేరియంట్ జేఎన్.1 కేసులు రికార్డయ్యాయి. ఈ క్రమంలో సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పొరుగు రాష్ట్రంలో కొవిడ్ కేసులు పెరుగుదల, కొత్త వేరియంట్ కేసులు గుర్తించడం తమిళనాడు అప్రమత్తమైంది. అయితే, మహమ్మారిని ఎదుర్కొనేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణ్యం తెలిపారు. వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్యశాఖ అధికారులను కోరినట్లు పేర్కొన్నారు.
ఏదైనా ప్రత్యేక ప్రాంతంలో జ్వరపీడితులు పెరిగితే ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించినట్లు చెప్పారు. మరో వైపు కేరళలోనూ కొవిడ్ కేసులు భారీగా పెరిగాయి. ప్రస్తుతం కేరళలో యాక్టివ్ కేసుల సంఖ్య 1144 పెరిగింది. కేరళ ఆరోగ్యశాఖ అధికారులతో టచ్లో ఉంటూ.. అక్కడి పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. మరో వైపు కొత్త కోవిడ్ కేసులు పెరుగుతుండడంతో ఇండియా సార్స్-కోవ్2 జీనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. కొవిడ్ సబ్ వేరియంట్ జేఎన్.1 కేసు కేరళలో గుర్తించినట్లు పేర్కొంది. ఆసుపత్రుల్లో సంసిద్ధతను అంచనా వేసేందుకు కేంద్రం రాష్ట్రంలోని అన్ని ఆరోగ్యశాఖ కేంద్రాల్లో మాక్ డ్రిల్లను నిర్వహిస్తోందని తెలిపింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్ర అధికారులతో సంప్రదింపులు జరుపుతూ.. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు చెప్పింది.