Car Prices Hike | న్యూఢిల్లీ, డిసెంబర్ 8: కొత్త కారు కొనాలనుకుంటున్నారా? అయితే వెంటనే త్వరపడండి. ఈ నెలలోనే కొనేయండి. లేకుంటే మీ జేబుకు చిల్లు పడటం ఖాయం. త్వరలో హ్యాచ్బ్యాక్ మొదలుకొని హై-ఎండ్ లగ్జరీ మోడళ్ల వరకు దాదాపు అన్ని రకాల కార్ల ధరలను పెంచబోతున్నట్టు ఆటోమొబైల్ కంపెనీలు ప్రకటించాయి.
జనవరి నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేశాయి. ఉత్పత్తి వ్యయం, నిర్వహణ ఖర్చులు పెరగడమే ఇందుకు కారణమని తెలిపాయి. దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకీ తన ఎంట్రీ లెవల్ కారు ‘ఆల్టో కే-10’ మొదలుకొని మల్టీ యుటిలిటీ వెహికల్ ‘ఇన్విక్టో’ వరకు అన్ని రకాల మోడళ్ల ధరలను 4% మేరకు పెంచనున్నట్టు ప్రకటించగా..
హ్యుందాయ్ కంపెనీ తమ కార్ల ధరలను రూ.25 వేల వరకు పెంచనున్నట్టు వెల్లడించింది. అలాగే జనవరి నుంచి మహీంద్రా అండ్ మహీంద్రా, జేఎస్డబ్ల్యూ ఎంజీ, మెర్సిడెస్ బెంజ్, ఆడీ, బీఎండబ్ల్యూ కార్ల ధరలను 3% మేరకు పెంచనున్నట్టు ఆయా సంస్థలు తెలిపాయి.