బికనీర్: అదృష్టమంటే ఆ కారులోని ప్రయాణికులదే. ఆ ప్రమాద దృశ్యం చూసినవారెవరైనా కారులోని వారంతా చనిపోవడమో, తీవ్రంగా గాయపడటమో జరుగుతుందని భావిస్తారు. అయితే ఒంటిపై చిన్న గాయం కూడా కాకుండా బయటపడ్డారు. వివరాల్లోకి వెళితే.. జాతీయ రహదారిపై అతి వేగంగా వస్తున్న ఒక కారు అదుపు తప్పి 8 పల్టీలు కొట్టిన ఘటన రాజస్థాన్‌లోని నాగౌర్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారులోని ఐదుగురూ ఎలాంటి గాయాలు కాకుండా తప్పించుకోవడం విశేషం.
దీనికి సంబందించిన దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి. నాగౌర్ నుంచి బికనీర్‌కు ఐదుగురు ప్రయాణికులతో ఒక ఎస్యూవీ కారు వెళ్తుండగా, మలుపు తిప్పుతున్న సమయంలో కారుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో సెకన్ల వ్యవధిలో కారు 8 పల్టీలు కొట్టి రోడ్డు పక్కనే ఉన్న ఒక కార్ల షోరూం గేట్‌పై తల్లకిందులుగా పడి ఆగిపోయింది. ప్రమాదం తర్వాత బయటపడ్ట వారు షోరూమ్‌లోకి నడుచుకుంటూ వెళ్లి ‘మాకు టీ ఇవ్వండి’ అని అడగటం ఆశ్చర్యపరిచింది.