జైపూర్: కారుకు మంటలు వ్యాపించడంతో డ్రైవర్ దానిని రోడ్డు పక్కగా నిలిపాడు. అయితే మంటలంటుకున్న కారు ఉన్నట్టుండి ముందుకు కదిలింది. దీంతో అక్కడున్న పలువురు వాహనదారులు షాక్ అయ్యారు. (Moving Car Catches Fire) కదులుతున్న ఆ కారు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. చివరకు డివైడర్‌ను ఢీకొన్న ఆ కారు ఆగడంతో అంతా ఊరట చెందారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఈ సంఘటన జరిగింది. శనివారం జైపూర్-అజ్మీర్ వంతెనపై ఒక కారు ప్రయాణించింది. అయితే ఆ కారులోని ఏసీ నుంచి పొగలు రావడాన్ని డ్రైవర్ జితేంద్ర గమనించాడు. దీంతో రోడ్డు పక్కగా పార్క్ చేశాడు. బానెట్‌ను తెరిచి చూడగా ఇంజిన్ నుంచి వచ్చిన మంటలు ఆ కారంతా వ్యాపించాయి. దీంతో డ్రైవర్ అక్కడి నుంచి దూరంగా వెళ్లాడు.
కాగా, మంటలు వ్యాపించిన ఆ కారు ఉన్నట్టుండి ముందుకు కదిలింది. ఆ రోడ్డుపై ఉన్న ద్విచక్ర వాహనదారులు, స్థానికులు ఇది చూసి షాక్ అయ్యారు. మంటలు వ్యాపించిన కారు వేగంగా దూసుకురావడం చూసి తప్పించుకునేందుకు పరుగులు తీశారు. చివరకు వంతెన కింద ఉన్న డివైడర్ పోల్‌ను ఢీకొట్టడంతో ఆ కారు ఆగిపోయింది. మంటల్లో అది కాలిపోయింది.
మరోవైపు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకున్నారు. కారుకు వ్యాపించిన మంటలను ఆర్పివేశారు. మంటల కారణంగా కారు హ్యాండ్ బ్రేక్ ఫెయిలై ఉంటుందని, దీంతో అది ముందుకు కదిలిందని అధికారులు తెలిపారు. ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదని చెప్పారు. అయితే మంటలు వ్యాపించిన కారు రోడ్డుపై వేగంగా కదిలిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Ghost Rider, Jaipur Edition
pic.twitter.com/BTQHTewAx3— Ghar Ke Kalesh (@gharkekalesh) October 13, 2024