న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్(లాల్ ఖిలా) మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 సమీపంలో సోమవారం సాయంత్రం కారులో జరిగిన పేలుడు తీవ్రతకు సమీపంలోని ఉన్న కార్లు, ద్విచక్రవాహనాలు, ఆటోలు సైతం పూర్తిగా దగ్ధమైనట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. తన కళ్ల ముందే ముక్కలైన శరీర భాగాలు గాలిలో ఎగిరి రోడ్డుపై పడ్డాయని ఓ ప్రత్యక్ష సాక్షి వివరించారు. పేలుడు శబ్దానికి తన చెవులు కొన్ని నిమిషాలపాటు మూసుకుపోయాయని వణుకుతున్న స్వరంతో ఆ వ్యక్తి తెలిపాడు. ఓ వ్యక్తి శరీరం తునాతునకలైపోయింది. తెగిపోయి పడి ఉన్న ఓ చేతిని రోడ్డుపై చూశాను. ఆ భయానక దృశ్యాన్ని మాటలతో వర్ణించలేను. ఇది మాత్రం చాలా భయంకరమైన పేలుడు అని మరో ప్రత్యక్ష సాక్షి వివరించాడు.
పేలుడు తీవ్రత ఎంత భారీగా ఉందంటే నా కళ్ల ముందు భూమి కుంగిపోయి నేను మరణిస్తున్నట్లు అనిపించిందని ఓ ప్రత్యక్ష సాక్షి తెలిపాడు. పేలుడు ధాటికి వీధి దీపాలు పేలిపోయి సమీపంలోని కార్లు, ఇతర వాహనాలకు నిప్పంటుకుందని ఆ వ్యక్తి చెప్పాడు. పేలుడు శబ్దం విని నేను పరిగెత్తాను. నాతోపాటే ఇతరులు కూడా పరుగెత్తారు. పరిగెత్తుతూ మూడుసార్లు కింద పడ్డాను. తమను తాను కాపాడుకునేందుకు పరుగులు పెట్టిన వారు ఒకరిపైన మరొకరు పడిపోయారు. రెండో పేలుడు సంభవిస్తే మేమంతా మరణించడం ఖాయమని అనుకున్నాను అని ఓ ప్రత్యక్ష సాక్షి చెప్పాడు.
తన జీవితంలో అంతటి భారీ శబ్దం వినలేదని పేలుడు జరిగిన సమయంలో సమీపంలోనే ఉన్న ఓ దుకాణదారుడు తెలిపాడు. పేలుడు జరిగిన సమయంలో తన దుకాణంలో కుర్చీలో కూర్చుని ఉన్నానని, పేలుడు తీవ్రతకు కుర్చీలో నుంచి కింద పడ్డానని ఆ దుకాణదారుడు చెప్పాడు. భూమి ముక్కలైపోతోందేమని భయపడిపోయానని, షాపు నుంచి బయటకు పరుగెత్తానని ఆయన తెలిపాడు. తనతోపాటే అనేక కుటుంబాలు కూడా పరుగులు తీశాయని, ఇంకో పేలుడు జరుగుతుందేమోనన్న భయంతో తామంతా పరుగులు పెట్టామని ఆ సాక్షి తెలిపాడు. పేలుడు తీవ్రతను బట్టి డజన్ల సంఖ్యలో మరణాలు సంభవించే అవకాశం ఉందని మరో ప్రత్యక్ష సాక్షి చెప్పాడు.
పేలుడు తీవ్రతకు సమీపంలోని అనేక భవనాలు, వాటి కిటికీలు భూకంపం వచ్చినట్లుగా కంపించిపోయాయని ఓ ప్రత్యక్ష సాక్షి చెప్పాడు. జామా మసీదుకు 1.1 కిలోమీటర్లు, గురుద్వారా సిస్ గంజ్ సాహిబ్ నుంచి కొన్ని వందల మీటర్ల దూరంలో ఉన్న లాల్ ఖిలా మెట్రో స్టేషన్ పరిసరాలు నిత్యం పర్యాటకులతో రద్దీగా ఉంటాయి. అయితే సోమవారం పర్యాటక ప్రదేశాలకు, మార్కెట్కు సెలవు కావడంతో జనసమ్మర్దం అంతగా లేదని ఓ ప్రత్యక్ష సాక్షి చెప్పాడు. అంతా హఠాత్తుగా జరిగిపోయిందని, పేలుడు ఒక కారులోనే జరిగినట్లు తనకు కనిపించలేదని ఆ వ్యక్తి తెలిపాడు.