న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: ఈవీఎం బ్యాలట్ పేపర్ల రూపును మారుస్తూ ఎన్నికల కమిషన్ బుధవారం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. రానున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచి ఈ కొత్త మార్గదర్శకాలు అమలులోకి వస్తాయి. ఎన్నికల నిబంధనావళి, 1961లోని 498 నిబంధన కింద ఇకపై ఈవీఎంలపైన అభ్యర్థుల బ్లాక్ అండ్ వైట్ ఫొటో స్థానంలో కలర్ ఫొటోను ముద్రించడం జరుగుతుంది. ఓటర్లు అభ్యర్థులను స్పష్టంగా గుర్తు పట్టేందుకు వీలుగా ఈసీ ఈ మార్పు చేపట్టింది. బ్యాలట్ పేపర్లో ఫొటో కోసం కేటాయించిన ప్రదేశంలో మూడు వంతులు నిండేలా ఫొటోను ముద్రిస్తారు. దీని వల్ల అభ్యర్థుల ముఖం స్పష్టంగా కనపడుతుంది. దీంతోపాటు అభ్యర్థి సీరియల్ నంబర్ని బ్యాలట్ పేపర్‌పైన మరింత ప్రస్ఫుటంగా కనిపించేలా ముద్రించనున్నారు. గతంలో ఉన్న మార్గదర్శకాల ప్రకారం బ్యాలట్ పేపర్లో అభ్యర్థి పేరు, పార్టీ చిహ్నం, సీరియల్ నంబర్ వంటి వివరాలతోపాటు అభ్యర్థి బ్లాక్ అండ్ వైట్ ఫొటో చాలా చిన్నదిగా ఉండేది. సవరించిన నిబంధనల కింద బ్యాలట్ పేపర్ డిజైన్, ప్రింటింగ్ మారనున్నాయి. పోలింగ్ కేంద్రాలలో ఓటర్లు గందరగోళానికి గురికాకుండా ఓటరు హితంగా ఉండే విధంగా ఈసీ మార్పులు తీసుకువస్తోంది.