భువనేశ్వర్, డిసెంబర్ 2: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శనివారం మరింత తీవ్రమైంది. ఇది తుఫానుగా మారి ఆంధ్ర ప్రదేశ్ కోస్తాలోని నెల్లూరు-మచిలీపట్నం మధ్య సోమవారం తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావం వల్ల ఏపీ, ఒడిశా రాష్ర్టాల్లో ఆది, సోమ, మంగళ వారాల్లో భారీ వర్షాలు పడవచ్చని తెలిపింది. తుఫాను తీరం దాటే సమయంలో 80-90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. అల్పపీడనం తుఫానుగా మారితే దానిని ‘మిచాంగ్’గా వ్యవహరించాలని మయన్మార్ సూచించినట్టు ఐఎండీ అధికారులు తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా అక్కడ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసినట్టు చెప్పారు. ఒడిశాలోని ఎనిమిది కోస్తా జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. తుఫాను నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్పే పరిధిలో 140 రైళ్లను రద్దు చేస్తున్నట్టు రైల్వే సీపీఆర్వో తెలిపారు. డిసెంబర్ 3 నుంచి 6 వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నామన్నారు. ఇందులో చాలా రైళ్లు పూర్తిగా, కొన్ని పాక్షికంగా రద్దు చేస్తున్నామని తెలిపారు.