Prajwal Revanna Case | ప్రధాని నరేంద్ర మోదీకి కర్ణాటక సీఎం సిద్ధ రామయ్య బుధవారం లేఖ రాశారు. ప్రజ్వల్ రేవణ్ణ డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్‌ను రద్దు చేసేలా హోంశాఖ, విదేశాంగ మంత్రిత్వ శాఖలకు ఆదేశించాలని కోరారు. విదేశాలకు పారిపోయిన ప్రజ్వల్ రేవణ్ణను భారత్‌కు రప్పించేందుకు చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. జేడీ(ఎస్) నేత, హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.
లైంగిక వేధింపుల ఆరోపణలు, అశ్లీల వీడియోల కేసులో ప్రజ్వల్ రేవణ్ణను పార్టీ జేడీ(ఎస్) నుంచి కుమారస్వామి బహిష్కరించారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై సిట్ విచారణ జరుపుతున్నది. అయితే, హాసన్ ఎంపీ లోక్‌సభ మొదటి దశ ఎన్నికల తర్వాత జర్మనీకి పారిపోయినట్లుగా ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంతో ప్రస్తుతం కర్ణాటకలో రాజకీయాలు వేడెక్కాయి. ఈ క్రమంలో సిద్ధ రామయ్య ప్రధాని లేఖ రాశారు. ప్రజ్వల్ రేవణ్ణ దౌత్య పాస్‌పోర్ట్‌ను రద్దు చేసేందుకు సత్వర చర్యలు తీసుకునేలా విదేశాంగ, హోం మంత్రిత్వ శాఖలను ఆదేశించాలన్నారు.
అలాగే, భారత ప్రభుత్వ దౌత్యం, పోలీసు మార్గాలతో పాటు అంతర్జాతీయ పోలీసు ఏజెన్సీలను ఉపయోగించి త్వరగా తిరిగి వచ్చేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సిద్ధరామయ్య ప్రధాని మోదీని కోరారు. పరారీలో ఉన్న పార్లమెంటు సభ్యుడు పూర్తి స్థాయి చట్టాన్ని ఎదుర్కోవాలన్నారు. మరో వైపు లైంగిక వేధింపులపై ప్రజ్వల్ రేవణ్ణ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తాను బెంగళూరులో లేనందున విచారణకు హాజరుకాలేకపోతున్నట్లు తెలిపారు. బెంగళూరు సీఐడీతో తమ న్యాయవాది మాట్లాడారన్నారు. నిజం త్వరలోనే బయటకు వస్తుందని పేర్కొన్నారు.