Supreme Court | న్యూఢిల్లీ, జూలై 15: నోయిడాలో వీధి కుక్కలకు ఆహారం పెట్టకుండా వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్పై మంగళవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు ‘ఆ కుక్కలకు మీ ఇంట్లోనే తిండి పెట్టవచ్చు కదా’ అని ప్రశ్నించింది. ‘ఈ దొడ్డ మనసున్న వ్యక్తుల కోసం అన్ని వీధులు, అన్ని రోడ్లు ఖాళీగా వదిలిపెట్టాలా? మనుషులకే స్థలం లేదు.. ఈ జంతువుల కోసం ఎక్కడ చూసినా స్థలం ఉంది.
ఎందుకు మీ ఇంట్లోనే వాటికి ఆహారం పెట్టరు? ఎవరూ మిమల్ని ఆపారు’ అని పిటిషనర్ తరఫు న్యాయవాదితో జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం సూచించింది. అలహాబాద్ హైకోర్టు ఈ ఏడాది మార్చిలో ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఈ పిటిషన్ దాఖలైంది. ‘మీ ఇంట్లోనే వీధి కుక్కల కోసం ఓ షెల్టర్ ప్రారంభించి మీ ప్రాంతంలో ఉన్న ప్రతి వీధి కుక్కకు ఆహారం పెట్టాలని మీకు సలహా ఇస్తున్నాము’ అని ధర్మాసనం తెలిపింది.