Assembly Elections : తమిళనాడు (Tamil Nadu) లో అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) పోరు క్లైమాక్స్‌కు చేరుకుంది. హోరాహోరీగా సాగిన ప్రచార పర్వం మంగళవారం సాయంత్రం 6 గంటలకు ముగిసింది. ఏప్రిల్ 23న (బుధవారం) అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. రాష్ట్రంలోని మొత్తం 234 నియోజకవర్గాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనున్నారు. ప్రచారానికి ఆఖరి రోజున ప్రధాన పార్టీలన్నీ రోడ్ షోలు, బహిరంగ సభలతో హోరెత్తించాయి. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) తన కోలత్తూరు నియోజకవర్గంలో ప్రచారాన్ని ముగించగా.. విపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామి (Palani Swamy) ఎడప్పాడిలో భారీ ర్యాలీ నిర్వహించారు.
ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్ కమిషన్ సర్వం సిద్ధం చేసింది. సుమారు 5.6 కోట్ల మంది ఓటర్లు తమ తీర్పును వెల్లడించనున్నారు. ఈసారి ఎన్నికలు కేవలం డీఎంకే, ఏఐఏడీఎంకే మధ్యే కాకుండా త్రిముఖ పోరును తలపిస్తున్నాయి. ప్రముఖ నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం తొలిసారి బరిలోకి దిగడం రాజకీయ సమీకరణాలను మార్చేసింది. విజయ్ స్వయంగా పెరంబూరు నుంచి పోటీ చేస్తుండటంతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా ఆయన చేసిన ప్రచారానికి యువత, మహిళల నుంచి విశేష స్పందన లభించింది. ఏ పార్టీతోనూ పొత్తు లేకుండా ఒంటరిగా బరిలోకి దిగిన విజయ్.. అటు డీఎంకే, ఇటు ఏఐఏడీఎంకే ఓటు బ్యాంకుకు గండి కొడతారనే చర్చ నడుస్తోంది.
అధికార డీఎంకే కూటమి తమ ద్రవిడ మోడల్ పాలన, సంక్షేమ పథకాలను నమ్ముకుని ప్రచారం నిర్వహించింది. మరోవైపు బీజేపీతో మళ్లీ జతకట్టిన ఏఐఏడీఎంకే ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిని అస్త్రాలుగా చేసుకుని విమర్శలు గుప్పించింది. ప్రధాని నరేంద్ర మోదీ పలుమార్లు తమిళనాడులో పర్యటించి ఎన్డీయే అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించగా.. రాహుల్ గాంధీ కూడా డీఎంకే కూటమికి మద్దతుగా సభల్లో పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా ఒకరిపై ఒకరు చేసుకున్న వ్యక్తిగత విమర్శలు, సవాళ్లతో తమిళనాడులో రాజకీయ వాతావరణం హీట్‌గా మారింది.