UP : పాకిస్తాన్ జాతీయురాలైన ఒక మహిళ ఇండియాలో ఫేక్ డాక్యుమెంట్లతో ప్రభుత్వ ఉద్యోగం పొందింది. ఉత్తర ప్రదేశ్ లో 30 ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ, కొనసాగించిన మోసం ఎట్టకేలకు బయటపడింది. పోలీసుల వివరాల ప్రకారం.. 1970లలో ఇండియన్ అయిన మహిరా అక్తర్ అలియాస్ ఫర్జానా అనే మహిళ 1979లో ఒక పాకిస్తానీని పెళ్లాడింది.
అదే సమయంలో ఇండియా విడిచి అతడితోపాటే పాకిస్తాన్ వెళ్లిపోయింది. అక్కడి పౌరసత్వం తీసుకుంది. కొన్నేళ్లపాటు అక్కడే కాపురం చేసింది. అయితే, కొంతకాలం తర్వాత విబేధాల కారణంగా భర్తతో విడాకులు తీసుకుని, తిరిగి ఇండియాకు వచ్చింది. అప్పటికే అమె పాక్ జాతీయురాలే. పాకిస్తాన్ పాస్ పోర్టు మీదే ఇండియాకు వచ్చింది. కొంతకాలానికి 1985లో ఇండియన్ ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి, భారతీయురాలిగా నమ్మిస్తూ ఇక్కడే ఉండిపోయింది.
ఇదే సమయంలో ఫేక్ డాక్యుమెంట్లతోనే యూపీలో విద్యాశాఖలో ఉద్యోగంలో చేరింది. అక్కడి రాంపూర్ లో 30 ఏళ్లుగా ఉద్యోగం చేస్తోంది. చివరకు ఆమె ఫేక్ డాక్యుమెంట్ల వ్యవహారం బయటపడటంతో అధికారులు ఉద్యోగంలోంచి తొలగించారు. వివిధ సెక్షన్ల కింద ఆమెపై పోలీసు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.