న్యూఢిల్లీ, మే 28: వరికి కనీస మద్దతు ధరను (ఎంఎస్పీ) కేంద్రం 3 శాతం పెంచింది. రూ.69 పెంపుదలతో క్వింటాలు ధాన్యం ఎంఎస్పీ రూ.2,369కి చేరింది. వరితోపాటు 14 వానకాల పంటల కనీస మద్దతు ధరలను కేంద్రం బుధవారం ప్రకటించింది. ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ వానకాల సీజన్ కోసం వ్యవసాయ శాఖ ఎంఎస్పీపై ఇచ్చిన ప్రతిపాదనలను ఆమోదించింది.
నైరుతి రుతు పవనాలు ముందుగానే దేశంలోకి ప్రవేశించిన నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. క్యాబినెట్ సమావేశం అనంతరం సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ విలేకరులతో మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం రెండు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. వానకాల పంటలకు ఎంఎస్పీ పెంపుతోపాటు వడ్డీ రాయితీ పథకంపై నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కమిషన్ సిఫార్సు మేరకు గడచిన 11 ఏళ్లలో 14 ఖరీఫ్ పంటలకు మద్దతు ధర భారీగా పెరిగిందని మంత్రి తెలిపారు.
రైతులకు సవరించిన వడ్డీ రాయితీ పథకాన్ని(ఎంఐఎస్ఎస్) 2025-26 సంవత్సరానికి కొనసాగించడానికి ప్రభుత్వం అంగీకరించింది. దీని కింద రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డు(కేసీసీ) ద్వారా తక్కువ ధరలకు స్వల్ప కాలిక రుణం లభిస్తుంది. ప్రస్తుతం అందచేస్తున్న 1.5 శాతం వడ్డీ రాయితీని కొనసాగించడానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదించినట్లు అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ పథకం కింద రైతులకు కిసాన్ క్రెడిట్ ద్వారా 7 శాతం వడ్డీ రేటుపై రూ. 3 లక్షల వరకు స్వల్ప కాలిక రుణం లభిస్తుంది. రుణాలను సకాలంలో చెల్లించే రైతులకు 3 శాతం వరకు ఇన్సెంటివ్(పీపీఆర్)ని ప్రభుత్వం కల్పిస్తుంది. దీంతో కేసీసీ రుణాలకు కేవలం 4 శాతం వడ్డీకే రుణాలు లభించినట్లవుతుంది.