న్యూఢిల్లీ: యాప్ ఆధారిత ట్యాక్సీ సేవలు వినియోగించుకునే ప్రయాణికుల జేబుకు చిల్లు పడనుంది. రద్దీ సమయాల్లో కనీస చార్జీపై రెండింతలు పెంచుకునేందుకు ఉబర్, ఓలా, ర్యాపిడో వంటి క్యాబ్ అగ్రిగేటర్లకు కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ అనుమతినిచ్చింది. గతంలో ఇది 1.5 రెట్లుగా ఉండేది. సాధారణ సమయాల్లో కనీస చార్జీపై ఇది 50 శాతంగా మాత్రమే ఉండాలని స్పష్టం చేసింది. అలాగే, మూడు కిలోమీటర్ల లోపు ప్రయాణించే వారిపై అదనపు చార్జీలు వసూలు చేయకూడదని షరతు విధించింది. ఈ కొత్త మార్గదర్శకాలను మూడు నెలల్లో అమలు చేయాలని రాష్ర్టాలకు ఆదేశాలు జారీచేసింది. అలాగే, ఎలాంటి కారణం లేకుండా రైడ్‌ను రద్దు చేస్తే డ్రైవర్‌కు చార్జీలో పది శాతం (రూ.100కు మించకుండా) జరిమానా విధిస్తారు. అదే సమయంలో ప్రయాణికుడికి కూడా ఇదే వర్తిస్తుంది.
ప్రతి డ్రైవర్‌కు కనీసం రూ. 5 లక్షల ఆరోగ్య బీమా, రూ. 10 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ కవరేజ్‌ను ఆయా అగ్రిగేటర్లు అందించాలి. అలాగే, డ్రైవర్ పికప్ పాయింట్‌కు చేరుకోవడానికి చార్జీ విధించకూడదని కేంద్రం తన మార్గదర్శకాల్లో పేర్కొన్నది. కాగా, కర్ణాటకలో ఇటీవల బైక్ట్యాక్సీలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రైవేట్ మోటార్ సైకిళ్లను వినియోగించడానికి కేంద్రం అనుమతినిచ్చింది. కొత్త నిబంధనల ప్రకారం, ఆటోలు, బైక్ ట్యాక్సీలు సహా ఇతర వాహనాలకు బేస్ చార్జీలను నిర్ణయించే అధికారాన్ని కేంద్రం రాష్ర్టాలకు అప్పగించింది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నోటిఫై చేయకపోతే, ఆ ధరలను ప్రకటించే బాధ్యత అగ్రిగేటర్లదేనని తెలిపింది. ఆ వివరాలను రాష్ట్ర ప్రభుత్వాలకు అందించాలని పేర్కొన్నది.