MUDA Scam : ముడా స్కామ్‌లో కర్నాటక సీఎం సిద్ధరామయ్య విచారణకు గవర్నర్ అనుమతించిన క్రమంలో సిద్ధరామయ్య సీఎం పదవికి తక్షణమే రాజీనామా చేయాలని కర్నాటక బీజేపీ చీఫ్ బీవై విజయేంద్ర డిమాండ్ చేశారు. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బ్లాక్‌మెయిల్‌కు తాము భయపడబోమని స్పష్టం చేశారు. అవినీతి కుంభకోణాలకు వ్యతిరేకంగా తాము మూడు నెలలుగా పోరాడుతున్నామని చెప్పారు.
ఇప్పుడు గవర్నర్ స్పందించి సీఎం ప్రాసిక్యూషన్‌కు అనుమతించడంతో కాంగ్రెస్, సిద్ధరామయ్య ఈ వ్యవహారాన్ని రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. లూటీ చేసిన సొమ్ము ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్‌కు చేరవేయడంతో విపక్ష నేత రాహుల్ గాంధీ సిద్ధరామయ్యను రాజీనామా చేయాలని కోరతారని తాము అనుకోవడం లేదని విజయేంద్ర వ్యాఖ్యానించారు. మరోవైపు ముడా స్కామ్‌లో ప్రమేయం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తడంతో సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేయాలని బీజేపీ శ్రేణులు బెంగళూర్‌లో నిరసన ప్రదర్శనలు చేపట్టాయి.
కాగా మైసూరు నగర అభివృద్ధి ప్రాధికార సంస్థ (MUDA) కుంభకోణంపై సిద్ధరామయ్యను విచారించేందుకు కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ఇటీవల ఆమోదం తెలుపడం ఆ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. సీఎంపై విచారణకు గవర్నర్ అనుమతి ఇచ్చినందున ఇక సిద్ధరామయ్య అరెస్ట్ ఖాయమనే ప్రచారం జరుగుతున్నది. ఈ క్రమంలో సిద్ధరామయ్య కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు.ముడా (MUDA) కుంభకోణంలో తనపై విచారణకు గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ అనుమతి ఇవ్వడాన్ని సిద్ధరామయ్య హైకోర్టులో సవాల్ చేశారు.
Read More :
Raksha Bandhan | రాఖీపండుగ సందర్భంగా చెట్టుకు రాఖీ కట్టిన బీహార్ సీఎం.. Video