చెన్నై: ‘సనాతన ధర్మం’ డెంగ్యూ, మలేరియా లాంటిదని, దాన్ని నిర్మూలించాలని తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా మత, రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. స్టాలిన్ వ్యాఖ్యలపై మతపెద్దలు, అర్చకులు, బీజేపీ సహా కొన్ని పార్టీల నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఉదయనిధి మాత్రం తగ్గేదే లే అంటున్నాడు. తన వ్యాఖ్యలను సమర్థించుకుంటున్నాడు.
సనాతన ధర్మాన్ని నిర్మూలించాలనే పిలుపునకు అర్థం మారణహోమానికి ఆహ్వానం పలుకడం లాంటిదని, సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్లందరిని చంపాలని పిలుపునివ్వడం లాంటిదని బీజేపీ నేతలు విమర్శలు చేస్తుండటంపై స్టాలిన్ మండిపడ్డారు. ప్రధాని నరేంద్రమోదీ తరచూ ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ అనే నినాదం చేస్తుంటారని, దానికి అర్థం కాంగ్రెస్ వాళ్లందరినీ చంపేయాలనా..? అని ఆయన ప్రశ్నించారు.
కొంతమంది ద్రవిడాన్ని అంతం చేయాలని పిలుపునిస్తుంటారని దానికి అర్థం డీఎంకే వాళ్లను చంపేయాలని అర్థమా..? అని ఉదయనిధి ప్రశ్నించారు. సనాతన ధర్మాన్ని విమర్శించే హక్కు తనకుందని, ఎవరెన్ని మాట్లాడినా సనాతన ధర్మాన్ని అంతం చేయాలనే తన డిమాండ్‌ను మళ్లీమళ్లీ వినిపిస్తూనే ఉంటానని ఆయన తెగేసి చెప్పారు. దీనిపై ఎవరెన్ని కేసులు వేసినా తాను న్యాయపోరాటం చేస్తానని వ్యాఖ్యానించారు.