ఢిల్లీలో అందని ద్రాక్షలా 45 వేల ఇండ్లు
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): పీఎం ఆవాస్ యోజన కింద పేదలకు ఇండ్లు కట్టిస్తున్నామని ప్రచారం చేసుకునే మోదీ ప్రభుత్వం.. ఢిల్లీలో పేదల కోసం కట్టిన ఇండ్లను మాత్రం ఇవ్వకుండా మోకాలడ్డుతున్నది. ఢిల్లీలోని ఆప్ సర్కారు పేదలకు చౌక ధరకు ఇండ్లు కేటాయిద్దామంటే, కేంద్రం మాత్రం అనుమతి ఇవ్వకుండా ఫైల్‌ను తొక్కిపెడుతున్నది. ఇండ్ల నిర్మాణం పూర్తయినా కేంద్రం, ఢిల్లీ సర్కారు మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవటంతో రెండేండ్లుగా దాదాపు 45 వేల ఇండ్లు అందని ద్రాక్షలా మిగిలిపోయాయి.
జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యూవల్ మిషన్ పథకం కింద ఢిల్లీలో 45 వేల ఫ్లాట్లు నిర్మించారు. దీనికయ్యే వ్యయాన్ని కేంద్రం, ఢిల్లీ సర్కారు చెరిసగం భరించాయి. ఆప్ సర్కారు అధికారంలోకి రాగానే మురికివాడల్లో నివసించే పేదలకు ఇండ్లు నిర్మించి ఇచ్చే పథకాన్ని ప్రవేశపెట్టింది. 2 వేల మందికి ఇండ్లు కూడా కేటాయించింది. అదనంగా 9,535 లబ్ధిదారుల నుంచి టోకెన్ అడ్వాన్సు కూడా తీసుకొన్నది. అయితే, కిరాయి ఇండ్ల పథకాన్ని(ఏఆర్‌హెచ్‌సీ) ప్రవేశపెట్టిన కేంద్రం.. ఆ ఫ్లాట్లను కిరాయికి ఇవ్వాలని చూస్తున్నది. అందులోభాగంగానే పేదలకు ఫ్లాట్ల కేటాయింపును నిలిపివేయాలని ఢిల్లీ సర్కారును ఆదేశించింది. ఆప్ సర్కారు మాత్రం కిరాయికి ఇవ్వటం కాకుండా, పేదలకు ఇస్తామంటున్నది. ఇలా.. ఎవరూ తగ్గకపోవటంతో రెండేండ్లుగా ఆ ఇండ్లు పేదలకు దక్కకుండా పోతున్నాయి.