Karnataka | తుమకూరు/బెంగళూరు, జూలై 14: కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో సామాన్య ప్రజలపై మరో భారం పడనున్నది. రాష్ట్రంలో త్వరలో బస్సు చార్జీలు భారీ స్థాయిలో పెరుగనున్నాయి. దీనిపై కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(కేఎస్ఆర్టీసీ) చైర్మన్ ఎస్ఆర్ శ్రీనివాస్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ కీలక విషయాలు వెల్లడించారు. ప్రభుత్వ బస్సుల్లో చార్జీల పెంపు అనేది అనివార్యమని ఆయన పేర్కొన్నారు. బస్సు చార్జీలను 15-20 పెంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేఎస్ఆర్టీసీ ఇప్పటికే ప్రతిపాదనలు పంపిందని వెల్లడించారు. ‘రెండు రోజుల క్రితం మా బోర్డు సమావేశం జరిగింది. బస్సు చార్జీలను 15-20 పెంచాలని మేం ప్రతిపాదనలు పంపాం. మిగతాది సీఎం సిద్ధరామయ్య విచక్షణపై ఆధారపడి ఉంటుంది. కేఎస్ఆర్టీసీ మనుగడ సాగించాలంటే, చార్జీల పెంపు తప్పనిసరి’ శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఇంధన, బస్సుల విడి పరికరాల ధరలు పెరిగాయని చెప్పారు. 2019 నుంచి రాష్ట్రంలో చార్జీల పెంపు లేదని, అదేవిధంగా కేఎస్ఆర్టీసీ ఉద్యోగుల వేతనాల సవరణ కూడా 2020 నుంచి జరుగలేదని, కాబట్టి టికెట్ ధరలను పెంచడం అవసరమని చెప్పుకొచ్చారు. గత మూడు నెలల కాలంలో కార్పొరేషన్‌కు రూ.295 కోట్ల నష్టం వచ్చిందని వెల్లడించారు.
ఐదు గ్యారెంటీల పేరుతో కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలపై పన్నుల మోత మోగిస్తున్నది. వివిధ రకాల పన్నులు, ఇతరత్రా రూపాల్లో సామాన్యుడి జేబును గుల్ల చేస్తున్నది. ఇప్పటికే గైడెన్స్ వ్యాల్యూ ట్యాక్స్, అదనపు ఎక్సైజ్ డ్యూటీ, రవాణా వాహనాలపై అదనపు సెస్, ఈవీలపై లైఫ్ టైమ్ ట్యాక్స్‌ను ఇబ్బడిముబ్బడిగా వసూలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం గత నెలలో పెట్రోల్, డీజిల్‌పై సేల్స్ ట్యాక్స్‌ను దాదాపు 4 శాతం చొప్పున పెంచింది. దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ.3, లీటర్ డీజిల్ ధర రూ.3.02 మేర పెరిగింది. మరోవైపు పాల ధరలను కూడా లీటర్, అర లీటర్ ప్యాకెట్లపై రూ.2 చొప్పున కర్ణాటక మిల్క్ ఫెడరేషన్(కేఎంఎఫ్) పెంచిన విషయం తెలిసిందే.
గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఐదు గ్యారెంటీల ప్రచారంతో కాంగ్రెస్ ఊదరగొట్టింది. ఆ గ్యారెంటీలను అమలు చేయాలంటే వేలాది కోట్ల రూపాయలు అవసరం. అయితే నిధుల అందుబాటును పరిగణనలోకి తీసుకోకుండా అడ్డగోలుగా హామీలిచ్చేసిన కాంగ్రెస్.. అధికారం చేపట్టిన తర్వాత ఆయా గ్యారెంటీలకు ఆంక్షలు, కోతలతో ఎగనామం పెడుతున్నది. ‘ఉచిత విద్యుత్తు’ అంటూ ఊదరగొట్టి ఛార్జీల పెంపునకు తెరతీశారని, మహిళలకు ఆర్థిక భరోసా ఇస్తామన్న ‘గృహలక్ష్మి’ స్కీమ్‌కు కొత్త ఆంక్షలు జోడించారని, ఆడబిడ్డలకు ఉచిత బస్సు సర్వీసులంటూ ఊరించిన ‘శక్తి’ స్కీమ్‌లో వయసు, వృత్తి అంటూ కొత్త పరిమితులు తెచ్చారని, నిరుద్యోగులకు భృతి కల్పిస్తామన్న ‘యువనిధి’, పేదలకు ఉచిత బియ్యమన్న ‘అన్నభాగ్య’ ఇలా ప్రతీ స్కీమ్‌లోనూ కోతలు విధిస్తున్నారని ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు.