బెంగళూరు, జూన్ 18: కర్ణాటకలో ఇబ్బడిముబ్బడి హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు ఆ ‘ఐదు గ్యారెంటీ’లను అమలు చేసేందుకు ఆపసోపాలు పడుతున్నది. నిధుల కోసం సామాన్య ప్రజల జేబులను గుల్ల చేసే పని ప్రారంభించింది. ఇందులో భాగంగా పెట్రోల్, డీజిల్‌పై సేల్స్ ట్యాక్స్‌ను పెంచేసిన సిద్ధరామయ్య సర్కార్.. ఇప్పుడు బస్సు చార్జీలను కూడా పెంచే యోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది.
బస్సు చార్జీలను పెంచాలా? లేదా? అనే విషయంలో తాను రవాణా శాఖ అధికారులతో చర్చలు జరుపుతానని సీఎం సిద్ధరామయ్య సోమవారం మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు. బస్సు చార్జీలను పెంచి చాలా కాలం అయిందనే విధంగా ఆయన చెప్పుకొచ్చారు. ‘చార్జీల పెంపు ప్రతిపాదన ప్రస్తుతానికి మా ముందు లేదు. కానీ దీనిపై రవాణా శాఖ అధికారులతో చర్చిస్తా’ అని సీఎం పేర్కొన్నారు.
పన్నుల పెంపునకు సమర్థన
పెట్రోల్, డీజిల్‌పై సేల్స్ ట్యాక్స్ పెంపును సీఎం సిద్ధరామయ్య సమర్థించుకొన్నారు. జీఎస్టీ వచ్చినప్పటి నుంచి ఆదాయాలు పెంచుకొనే స్వేచ్ఛను రాష్ట్ర ప్రభుత్వాలు కోల్పోయాయని, రాష్ర్టాలకు ఇంధనం, లిక్కర్, స్టాంప్ డ్యూటీలు, మోటార్ వాహనాలు మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు. పన్నుల వాటా పంపిణీలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు.
ఏడాదిలో వరుస పన్నుల మోత
కర్ణాటకలో ఏడాది కిందట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై పన్నుల మోత మోగిస్తున్నది. ఇప్పటికే గైడెన్స్ వ్యాల్యూ ట్యాక్స్, అదనపు ఎక్సైజ్ డ్యూటీ, రవాణా వాహనాలపై అదనపు సెస్, ఈవీలపై లైఫ్ టైమ్ ట్యాక్స్‌ను ఇబ్బడిముబ్బడిగా వసూలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. పెట్రోల్, డీజిల్‌పై సేల్స్ ట్యాక్స్‌ను పెంచుతూ గత శనివారం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే.
పెట్రోల్‌పై సేల్స్ ట్యాక్స్‌ను 25.92 నుంచి 29.84 శాతానికి (3.92 శాతం పెరుగుదల), డీజిల్‌పై 14.3 శాతం నుంచి 18.4 శాతానికి (4.1 శాతం పెరుగుదల) పెంచింది. దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ.3, లీటర్ డీజిల్ ధర రూ.3.02 మేర పెరిగింది. దీనిపై సామాన్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంధన, నిత్యావసరాల ధరలతో అల్లాడుతుంటే.. మళ్లీ ఈ అదనపు వడ్డింపు ఏంటని కాంగ్రెస్ సర్కార్‌ను నిలదీస్తున్నారు.