న్యూఢిల్లీ, అక్టోబర్ 3: భారతీయ న్యాయవ్యవస్థ చట్టాల పునాదిపై ఏర్పడిందని, బుల్డోజర్ చట్టాల ఆధారంగా కాదని భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) బీఆర్ గవాయ్ స్పష్టం చేశారు. మారిషస్లో శుక్రవారం మారిస్ రోల్ట్ స్మారక ఉపన్యాసం-2025 ప్రారంభ కార్యక్రమంలో సీజేఐ ప్రసంగిస్తూ ఏకపక్ష ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా రాజ్యాంగ విలువలు, వ్యక్తిగత హక్కుల పరిరక్షణలో న్యాయవ్యవస్థ సాగిస్తున్న కృషిని ప్రస్తావించారు.
బుల్డోజర్ న్యాయంగా పేరు గాంచిన ప్రభుత్వ చట్ట వ్యతిరేక చర్యలపై గతంలోఇచ్చిన తీర్పు ను ఆయన గుర్తు చేశారు. తక్షణ న్యాయం పేరిట ప్రభుత్వాలు నిందితుల ఇళ్లను కూల్చివేయడాన్ని బుల్డోజర్ న్యాయంగా అభివర్ణించారు. భారతీయ న్యాయవ్యవస్థ చట్టాల ఆధారంగా పని చేస్తుందే తప్ప బుల్డోజర్ పాలనతో కాదని తన తీర్పు స్పష్టమైన సందేశం పంపిందని ఆయన చెప్పారు.