Yogi Aditya nath | రెండు నెలలుగా సాగిన సార్వత్రిక సమరం ముగిసింది. అంచనాల కంటే తక్కువ సీట్లు వచ్చినా అధికార ఎన్డీఏ కూటమికి ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ సీట్లు వచ్చాయి. లోక్సభ ఎన్నికల్లో కీలకమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అభివృద్ధి, దేవుడి పేరు చెప్పి ప్రజల మద్దతు కూడగట్టేందుకు ‘బుల్డోజర్ బాబా’.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రయత్నించారు. గత జనవరిలో అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్టతోపాటు యోగి ఆదిత్యనాథ్ పలు ప్రయత్నాలు చేసినా 2019 ఎన్నికల ఫలితాలతో పోలిస్తే, యూపీలో బీజేపీ దాదాపు సగం సీట్లు కోల్పోయింది. యూపీలో అఖిలేశ్ యాదవ్ సారధ్యంలోని సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) పుంజుకోకుండా యోగి ఆదిత్యనాథ్ నిలువరించడంలో విఫలమయ్యారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల ప్రచారంలో సుమారు 200 సభలు, రోడ్ షోల్లో పాల్గొన్నారు. ప్రతి రోజూ ఐదారు లోక్ సభ స్థానాల్లో ప్రచారం చేశారు. యోగితోపాటు ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితరులు విస్తృత ప్రచారం చేసినా ప్రయోజనం లేకపోయింది. యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్న ప్రచార సభలకు భారీగా ప్రజలు తరలి వచ్చినా ఉపయోగం లేకపోయింది.