New Delhi : దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం జరిగింది. ఒక భవనం కుప్పుకూలడంతో, ఆ శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. ఢిల్లీలోని సత్యనికేతన్ ప్రాంతంలో, ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే ఢిల్లీ ఫైర్ డిపార్ట్మెంట్కు, పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు.
ఫైర్ సిబ్బంది, పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. బిల్డింగ్ శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. అయితే, ఆ శిథిలాల కింద ఎంతమంది ఉన్నారు అనే విషయంలో స్పష్టత లేదు. ప్రాథమిక అంచనా ప్రకారం శిథిలాల కింద ఐదుగురు ఉండొచ్చని అనుమానిస్తున్నారు. బిల్డింగ్ కూలడానికి గల కారణాలపై కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. కొద్ది రోజులుగా ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తిన సంగతి తెలిసిందే.
వర్షాలు కూడా బిల్డింగ్ కూలడానికి ఒక కారణం అయ్యుండొచ్చని అంచనా. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతాయి. ఘటనా స్తలంలో అంబులెన్సులు, ఫైర్ ఇంజిన్లు సిద్ధంగా ఉన్నాయి. ఘటన జరిగిన ప్రదేశం ఢిల్లీ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్‌కు దగ్గర్లోనే ఉంది. ఘటనపై సమాచారం అందుకున్న పలువురు విద్యార్థులు కూడా సహాయక చర్యల్లో సాయం అందిస్తున్నారు.