Ranabaali | రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ప్రతిష్టాత్మక పీరియాడిక్ యాక్షన్ చిత్రం ‘రణబలి’. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 16న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. 19వ శతాబ్దంలో బ్రిటిష్ పాలన, 1854-1878 మధ్యకాలంలో నెలకొన్న కరువు పరిస్థితుల నేపథ్యంలో ఈ కథ సాగనున్నట్లు చిత్రబృందం ఇప్పటికే వెల్లడించింది. పెళ్లి తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి నటిస్తున్న తొలి సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక సినిమా ప్రమోషన్లలో భాగంగా దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా విద్యుత్ వినియోగం, ఆధునిక జీవనశైలిపై ఆయన చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.
‘రణబాలి’ కథ 19వ శతాబ్దం నేపథ్యంలో సాగుతుండటంతో.. అప్పటి మనుషుల జీవన విధానం, ఇప్పటి జీవనశైలికి ఉన్న వ్యత్యాసం గురించి రాహుల్ సాంకృత్యన్ మాట్లాడారు. విద్యుత్ అందుబాటులోకి వచ్చిన తర్వాత మనుషుల జీవనశైలిలో చాలా మార్పులు వచ్చాయని ఆయన అభిప్రాయపడ్డారు. విద్యుత్ రాకముందు చీకటి పడగానే ప్రజలు త్వరగా నిద్రపోయేవారని, ఇప్పుడు విద్యుత్ వెలుగులు అందుబాటులో ఉండటంతో అర్ధరాత్రి వరకు మేల్కొని ఉంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. దీనివల్ల సహజమైన జీవనశైలికి దూరమవుతున్నామని వివరించారు. సినిమా కథకు సంబంధించిన కాలాన్ని, అప్పటి ప్రజల జీవన విధానాన్ని వివరించే క్రమంలో దర్శకుడు ఈ ఉదాహరణను ప్రస్తావించినప్పటికీ.. ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ట్రోలింగ్ మొదలైంది.
రాహుల్ వ్యాఖ్యలపై కొందరు నెటిజన్లు సెటైరికల్‌గా స్పందిస్తున్నారు. సినిమా నిర్మాణంలోనే భారీ లైట్లు, అత్యాధునిక కెమెరాలు, విద్యుత్‌తో పనిచేసే పరికరాలను విస్తృతంగా ఉపయోగిస్తారని గుర్తుచేస్తూ.. అలాంటి సినిమా పరిశ్రమలో ఉండి విద్యుత్ వల్లే జీవనశైలి పాడవుతోందని చెప్పడం ఆసక్తికరంగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం రాత్రిళ్లు ఆలస్యంగా మేల్కొని ఉండటం అనేది వ్యక్తిగత జీవనశైలికి సంబంధించిన అంశమని, దానికి పూర్తిగా విద్యుత్‌ను కారణంగా చూపడం సరైనది కాదంటూ అభిప్రాయపడుతున్నారు. దర్శకుడి వ్యాఖ్యలను కొందరు నెటిజన్లు మరో కోణంలోనూ తీసుకున్నారు. ఆధునిక సౌకర్యాలను ఉపయోగించుకుంటూనే పాతకాలపు జీవన విధానాన్ని గొప్పగా చెప్పడం ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు. మరికొందరు మాత్రం ఆయన వ్యాఖ్యలను సందర్భం నుంచి విడదీసి చూస్తున్నారని, సినిమా కథకు సంబంధించిన కాలం గురించి ఆయన చెప్పిన విషయాలను అదే కోణంలో చూడాలని అంటున్నారు.అయితే సోషల్ మీడియాలో ఎక్కువగా సెటైరికల్ పోస్టులు, మీమ్స్ కనిపిస్తున్నాయి.