Al-Falah University | ఢిల్లీ బాంబు పేలుడు (Delhi Bomb Blast) ఘటన నేపథ్యంలో అల్ ఫలాహ్ వర్సిటీ (Al-Falah University) పేరు తెరపైకి వచ్చింది. ఈ వర్సిటీలో పనిచేస్తున్న డాక్టర్లు, ప్రొఫెసర్లు ఉగ్ర కుట్రలో భాగం కావడంతో దర్యాప్తు సంస్థల దృష్టి ఈ వర్సిటీపై పడింది. దర్యాప్తు అధికారులు వర్సిటీకి చేరుకొని ముమ్మరంగా సోదాలు చేస్తున్నారు. ఈ దర్యాప్తులో కీలక ఆధారాలు బయటపడ్డట్లు తెలుస్తోంది.
మెడికల్ కాలేజీలోని బాయ్స్ హాస్టల్ ఉండే 17వ నంబర్ భవనం వీరి ఉగ్ర కార్యకలాపాలకు అడ్డాగా ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఈ భవనంలోని 13వ నంబర్ గది కీలకంగా మారింది. ముజమ్మిల్‌కి చెందిన ఈ గది వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ (white collar terror module)కు రహస్య సమావేశ కేంద్రంగా పనిచేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఢిల్లీ, సమీప రాష్ట్రాల్లో పేలుళ్లకు ఈ గది నుంచే కుట్ర చేసినట్లు తేలింది.
యూనివర్సిటీ ల్యాబ్ నుంచి కొన్ని రసాయనాలను తీసుకురావాలని ఉమర్, ముజమ్మిల్ ప్లాన్ వేసినట్లుగా సమాచారం. ఈ గదిలో సోదాలు చేపట్టిన దర్యాప్తు అధికారులు కొన్ని కెమికల్స్‌తోపాటూ పెన్‌డ్రైవ్‌లు, పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ముజమ్మిల్ గదితో పాటు ఉమర్‌కు చెందిన 4వ నంబరు గది నుంచి మూడు డైరీలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అందులో కీలక విషయాలు ఉన్నట్లు దర్యాప్తు వర్గాలు తెలిపాయి. డైరీల్లో భారీ ఉగ్ర ప్లాన్లను గుర్తించినట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి.
మొత్తం 32 వాహనాల్లో పేలుడు పదార్ధాలను నింపాలని అనుమానిత ఉగ్రవాదులు ప్లాన్ చేసినట్లు ఇంటెలిజెన్స్ అధికారులు పేర్కొన్నారు. మొత్తం 8 మంది అనుమానితులు సుమారు నాలుగు లొకేషన్లలో పేలుడుకు పాల్పడాలని భావించినట్లు తెలుస్తున్నది. పేలుడు పదార్ధాలను కొనుగోలు చేసేందుకు వైట్‌కాలర్ డాక్టర్లు సుమారు 26 లక్షల నిధి సేకరించినట్లు తెలుస్తున్నది. అనుమానితులు డాక్టర్ ముజమ్మిల్ గన్నై, డాక్టర్ అదీల్ అహ్మద్ రాథర్, డాక్టర్ షహీన్ సయ్యిద్, డాక్టర్ ఉమర్ నబీ ఆ డబ్బును పోగు చేశారు. అయితే ఆపరేషన్స్ నిర్వహించేందుకు ఆ డబ్బును డాక్టర్ ఉమర్ వాడినట్లు తెలుస్తున్నది.
Also Read..
Delhi Blast | ఢిల్లీలో మరోసారి పేలుడు శబ్దం.. భయంతో వణికిపోయిన స్థానికులు.. చివరికి
Delhi Blast | బ్లాస్ట్‌కు ముందు మసీదును సందర్శించిన ఉమర్.. సీసీటీవీ దృష్యాలు వైరల్