Budget 2024 | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి ఒకటిన మోదీ ప్రభుత్వం 2.0 మధ్యంతర బడ్జెట్‌ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్లో ప్రభుత్వం రైల్వేలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తున్నది. కేంద్రం ఈ సారి రైల్వే బడ్జెట్లో కేటాయింపులు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైల్వేలకు కేటాయింపులు రూ.3లక్షల కోట్లకు పెంచే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. అలాగే వందే భారత్ రైళ్ల రోలింగ్‌పై ప్రభుత్వం దృష్టి సారించనున్నట్లు తెలుస్తున్నది. 2023 బడ్జెట్లో రైల్వేలకు మోదీ సర్కారు రూ.2.4లక్షల కోట్లు కేటాయించింది.
ఈ సారి బడ్జెట్లో ఎక్కువ భాగం ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా కేటాయింపులు ఉంటాయని రైల్వే వర్గాలు తెలిపాయి. ఎన్నికల సంవత్సరం కావడంతో దేశంలో ప్రయాణికులకు సౌకర్యాలను పెంచేందుకు దృష్టి సారించబోతున్నది. ఈ బడ్జెట్లో విద్యుదీకరణ, డబ్లింగ్‌కు పెద్దపీట వేయబోతున్నది. ఈ రెండింటికే కేటాయింపులు దాదాపు రూ.50వేలు కోట్లు కేటాయించే ఛాన్స్ ఉన్నది. మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం వందే భారత్ రైళ్లను ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ రైళ్లు దేశవ్యాప్తంగా పలు నగరాల మధ్య పరుగులు తీస్తున్నాయి.
ఈ క్రమంలో మధ్యంతర బడ్జెట్లోనూ వందే భారత్ రైళ్లపై మరింత దృష్టి సారించే అవకాశం ఉన్నది. రాబోయే మూడేళ్లలో 400 వందే భారత్ రైళ్లను పట్టాలెక్కించాలని భారతీయ రైల్వే లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ నేపథ్యంలో బడ్జెట్లో కొత్త హైస్పీడ్ రైల్వే కారిడార్‌ను సైతం ప్రకటించే ప్రకటించేందుకు అవకాశం ఉన్నది. స్టేషన్ల ట్రాక్ చుట్టూ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలున్నాయి. దాంతో బడ్జెట్లో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని పెంచడం ద్వారా సోలార్ ప్యానెళ్ల ఏర్పాటును ప్రభుత్వం ఆమోదం తెలుపనున్నట్లు సమాచారం. రైళ్లలో వై-ఫై సౌకర్యం కల్పించడంతోపాటు పీపీపీ మోడల్ ద్వారా నాన్ పెయిర్ ఆదాయాన్ని సైతం పెంచుకునేందుకు ప్రకటన చేసే అవకాశం ఉందని రైల్వే వర్గాలు వివరించాయి.