న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: ఆదాయ, వ్యయాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని పూడ్చుకునేందుకు ఏప్రిల్ 1 నుంచి మొదలయ్యే వచ్చే ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ నుంచి రూ.14.13 లక్షల కోట్ల రుణాలు సమీకరించాలని ఆర్థిక మంత్రి సీతారామన్ బడ్జెట్లో ప్రతిపాదించారు. అయితే ఈ మొత్తం 2023-24 ఆర్థిక సంవత్సరపు అంచనా రూ.15.43 లక్షల కోట్లకంటే తక్కువ.
2024-25 సంవత్సరంలో పన్ను ఆదాయం పెరుగుతుందన్న అంచనాలతో రుణ సమీకరణ లక్ష్యాన్ని కేంద్రం తగ్గించుకుంది. బాండ్లను జారీచేయడం ద్వారా ఈ మార్కెట్ రుణాల్ని ప్రభుత్వం సేకరిస్తుంది. ఆర్థిక మంత్రి లోక్సభలో మధ్యంతర బడ్జెట్ను సమర్పిస్తూ కేంద్ర ప్రభుత్వం సేకరించే రుణాలు తగ్గనున్నందున, ప్రైవేటు రంగానికి అధికస్థాయిలో రుణాలు అందుబాటులో ఉంటాయన్నారు.