న్యూఢిల్లీ : ఓట్ల కోసం రాముడిని తెరపైకి తీసుకువస్తున్న కాషాయ పార్టీ సీతాదేవిని విస్మరించిందని బీజేపీపై బీఎస్పీ విమర్శలు గుప్పించింది. యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో బీజేపీని టార్గెట్ చేస్తూ బీఎస్పీ నేత సతీష్ చంద్ర మిశ్రా విరుచుకుపడ్డారు. రాముడి పేరుతో బీజేపీ నాయకులు ఓట్లు అడుగుతున్నారు..అయితే వారు సీతను మరిచిపోయారని వ్యాఖ్యానించారు.
మతంపై విశ్వాసం ఉన్న వారందరికీ సీత లేనిదే రాముడు పరిపూర్ణుడు కాదని తెలుసన్నారు. అలాగే రాధ లేకుండా కృష్ణుడు లేడని, పార్వతి లేకుండా శివుడు లేడని అన్నారు. అయోధ్య జిల్లాలోని మిల్కిపూర్లో జరిగిన ర్యాలీని ఉద్దేశించి సతీష్ మిశ్రా మాట్లాడుతూ సీతను బీజేపీ విస్మరించిన తీరు మహిళల పట్ల కాషాయ పార్టీ ఆలోచనా విధానాన్ని తేటతెల్లం చేస్తోందని దుయ్యబట్టారు.
బీజేపీ, ఎస్పీ యూపీలో ఘర్షణలను ప్రేరేపిస్తున్నాయని ఆరోపించారు. బీజేపీ, ఎస్పీల హయాంలో యూపీలో దోపిడీ, మాఫియా, ఉగ్రమూకల స్వైరవిహారం, లైంగిక దాడులు, ఘర్షణలు సహజంగా మారాయని విమర్శించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అయోధ్యలో 25 సీట్లను బీఎస్పీ కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.