జమ్మూ, ఏప్రిల్ 13: మూడు నెలల క్రితం ఇంటి నుంచి తప్పిపోయి అంతర్జాతీయ సరిహద్దు వద్ద దిక్కుతోచక తిరుగుతున్న ఏపీ వ్యక్తిని సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) ఆయన కుటుంబ సభ్యులకు అప్పగించింది. తూర్పు గోదావరి జిల్లాలోని నేలటూరుకు చెందిన వెంకటరావు (50) అనే వ్యక్తి మూడు నెలల క్రితం కనిపించకుండా పోయారు. ఈ క్రమంలోనే జమ్మూలోని అక్నూర్-పాక్ సరిహద్దుల్లో సంచరిస్తుండగా, మార్చి 31న అతడిని బీఎస్ఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, అతను పూర్తి వివరాలు చెప్పలేక పోయాడు.
అయితే అతడిచ్చిన కొన్ని వివరాలతో అతడు ఏపీకి చెందిన వాడని, తప్పిపోయినట్టు గుర్తించి, మిగతా శాఖల సహాయంతో అతడి స్వస్థలాన్ని కనుగొన్నారు. ఎట్టకేలకు ఈ నెల 11న వెంకటరావును అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు. బీఎస్ఎఫ్కు ఆయన కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.