న్యూఢిల్లీ, మే 8 : పాకిస్థాన్ ఎటువంటి దుస్సాహసానికి దిగినా సమర్థంగా తిప్పికొట్టేందుకు సరిహద్దుల్లో భద్రతను మరింత పటిష్ఠం చేశారు. రాజస్థాన్‌లో ఉన్న పాక్ సరిహద్దును పూర్తిగా మూసివేశారు. ఆ ప్రాంతంలో సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్)కు కనిపిస్తే కాల్చివేసే ఆదేశాలు ఇచ్చారు. పంజాబ్‌లో కూడా భద్రతా యంత్రాంగం పూర్తిగా సమాయత్తమైంది.
పూంచ్ సెక్టార్లో పాక్ షెల్లింగ్ దాడిలో దెబ్బతిన్న తన ఇంటిని పరిశీలిస్తున్న స్థానికుడు
అక్కడ పోలీసు సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. రాజస్థాన్‌లో భారత్-పాక్ సరిహద్దు 1037 కిలోమీటర్ల పొడవున ఉంది. ఈ సరిహద్దు వెంట వైమానిక దళాన్ని అప్రమత్తంగా ఉంచారు. రాజస్థాన్‌లోని మూడు విమానాశ్రయాలను 2 రోజులపాటు మూసివేశారు. సరిహద్దు పట్టణాలైన బికనీర్, శ్రీగంగానగర్, జైసల్మేర్, బార్మర్‌లో స్కూళ్లు మూసివేసి, పరీక్షలను వాయిదా వేశారు. ఇక పంజాబ్‌లో ప్రభుత్వ కార్యకలాపాలన్నింటినీ రద్దు చేశారు.
పాకిస్థాన్ దాడిలో మరణించిన లాన్స్‌నాయక్ దినేశ్‌కుమార్‌కు హర్యానాలోని పల్వాల్ జిల్లాలో జరిగిన అంత్యక్రియల్లో శ్రద్ధాంజలి ఘటిస్తున్న కుటుంబసభ్యులు, స్థానికులు
భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన పాకిస్థానీ పౌరుడు బీఎస్ఎఫ్ కాల్పుల్లో మృతి చెందాడు. ఆ వ్యక్తి ఈ నెల 7-8 తేదీల మధ్య రాత్రి చీకట్లో అంతర్జాతీయ సరిహద్దు గుండా భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించాడు.