CM KCR | ఈ దేశం యువతీయువకులదే. భారతదేశ పరివర్తనతోనే అభివృద్ధి సాధ్యం. దేశ ప్రజలను చైతన్యపరచాల్సిన ప్రధాన బాధ్యత యువత మీదే ఉన్నది. ఇతర దేశాలు ఎట్లా అభివృద్ధి చెందుతున్నాయి? మనం ఎందుకు ఇంకా వెనకబడే ఉన్నామన్నది ఆలోచించాలి. దేశాన్ని బాగుచేసుకోవాలన్న తపన ఉండాలి.
– సీఎం కేసీఆర్
హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): ‘బీఆర్ఎస్ రూపంలో అభివృద్ధి మీ ఇంటి గడపముందుకు వచ్చి నిలబడ్డది. తలుపులు తెరిచి ఆహ్వానించండి. బీఆర్ఎస్ను ఆదరించండి. కిసాన్ సరార్తో మన జీవితాల్లో వెలుగులు నింపుకుందాం. తెలంగాణలో జరిగినట్టు మహారాష్ట్రలో ప్రగతి ఎందుకు సాధ్యం కాదో చూద్దాం’ అని బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.
మహారాష్ట్రతో తెలంగాణది ‘రోటీ బేటీ’ బంధమని, వెయ్యి కిలోమీటర్ల మేర సరిహద్దును పంచుకుంటున్న రెండు రాష్ట్రాల ప్రజల నడుమ మొదటి నుంచీ సామాజిక బాంధవ్యం, సాంసృ తిక సారూప్యత ఉన్నదని తెలిపారు. మహారాష్ట్ర అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. మహారాష్ట్రతో ఉన్న చారిత్రక, సాంస్కృతిక అనుబంధం వల్లే బీఆర్ఎస్ పార్టీ ఆ రాష్ట్రం నుంచి దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నదని పేర్కొన్నారు. తెలంగాణ స్ఫూరితో మహారాష్ట్రను కూడా ప్రగతిపథంలో నడిపించుకుందామని ఆ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు.
శనివారం సోలాపూర్, నాగ్‌పూర్ తదితర ప్రాంతాలనుంచి పదుల సంఖ్యలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీలకు చెందిన ప్రముఖులు తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి సీఎం గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ‘భారతదేశంలో ప్రస్తుత రాజకీయాలు పదవుల వెంట పరుగులు తీస్తున్నాయి. సొంత పార్టీలనే చీలికలు పేలికలు చేసుకుంటూ పదవుల కోసం ఈ పార్టీల నుంచి ఆ పార్టీలకు, ఆ పార్టీల నుంచి ఈ పార్టీలకు జంపులు చేస్తున్నారు. మహారాష్ట్రలో జరుగుతున్న సంఘటనలను దేశ ప్రజలు గమనిస్తున్నారు’ అని సీఎం అన్నారు.

ప్రజలను చైతన్యం చేయాల్సిన బాధ్యత యువతదే
ఈ దేశం యువతీయువకులదేనని, ఎంతో భవిష్యత్తు ఉన్న యువత దేశంలో గుణాత్మక మార్పు దిశగా ఆలోచన చేయాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. పరివర్తన చెందిన భారతదేశంతోనే అభివృద్ధి సాధ్యమని నొక్కిచెప్పారు. దేశ ప్రజలను చైతన్యపరచాల్సిన ప్రధాన బాధ్యత యువత మీదే ఉన్నదని పేర్కొన్నారు. భగత్‌సింగ్, అల్లూరి వంటి వారిని ఆదర్శంగా తీసుకొని ప్రజలను చైతన్యంచేయాలని పిలుపునిచ్చారు. ఇతర దేశాలు ఎట్లా అభివృద్ధి చెందుతున్నాయి? మనం ఎందుకు ఇంకా వెనకబడే ఉన్నామనే విషయాన్ని యువత ఆలోచించాలని కోరారు. దేశాన్ని బాగుచేసుకోవాలన్న తపన ప్రతీ ఒక్కరిలో ఉండాలని అన్నారు. తాను పదేపదే చెప్తున్న విషయాలను పరిగణనలోకి తీసుకొని తమతమ నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో, తమ కుటుంబ సభ్యులు, బంధు మిత్రులతో సమగ్రంగా చర్చించుకోవాలని సూచించారు.
ఇంకెన్నాళ్లిలా ఉందాం?
దేశంలో అవసరానికి మించి అందుబాటులో ఉన్న సహజ సంపదను 75 ఏండ్లు గడిచినా దేశ పాలకులు సరైన రీతిలో వినియోగంలోకి ఎందుకు తేలేకపోతున్నారనే విషయాన్ని ప్రజలు ఆలోచించాలని కేసీఆర్ కోరారు. ప్రపంచంలో మొన్నటి దాకా వెనుకబడి ఉన్న చైనా వంటి దేశాలు నేడు మనం అందుకోలేని స్థాయిలో అభివృద్ధి చెందాయని గుర్తుచేశారు. కేంద్ర పాలకులకు దేశాభివృద్ధిపై సరైన ఆలోచనలు లేకపోవడం వల్లే దేశం అన్ని రంగాల్లో వెనక్కి నెట్టివేయబడిందని అన్నారు. ప్రగతి నిరోధకులకు ఓట్లు వేసి గెలిపిస్తూ.. తాగునీరు, సాగునీరు, విద్యుత్తు వంటి కనీస సౌకర్యాలు లేకుండా ఇంకెన్నాళ్లు అభివృద్ధికి దూరంగా ఉందామని ప్రశ్నించారు. ‘బీఆర్ఎస్ రూపంలో అభివృద్ధి మీ ఇంటి గడపముందుకు వచ్చి నిలవడ్డది.
తలుపులు తెరిచి ఆహ్వానించండి. బీఆర్ఎస్ను ఆదరించండి. కిసాన్ సరార్తో మన జీవితాల్లో వెలుగులు నింపుకుందాం. తెలంగాణలో జరిగినట్టు మహారాష్ట్రలో ప్రగతిఎందుకు సాధ్యం కాదో చూద్దాం’ అని కేసీఆర్ స్పష్టం చేశారు. అబ్ కీ బార్ కిసాన్ సరార్ నినాదంతో ముందుకు సాగుతున్న బీఆర్ఎస్ పార్టీని మహారాష్ట్ర మీదుగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా విస్తరిస్తామని సీఎం పునరుద్ఘాటించారు. తెలంగాణ అభివృద్ధిని చూసేందుకు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి రావాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. అనేక అభివృద్ధి చెందిన దేశాలు వ్యవసాయ రంగానికి భారీగా సబ్సిడీలు ఇస్తుంటే.. వ్యవసాయాధారిత భారతదేశంలో పాలకులు సబ్సిడీలను వ్యతిరేకించడం శోచనీయమని ఆవేదన వ్యక్తంచేశారు. అబ్ కీ బార్ కిసాన్ సరార్ అనే తమ పార్టీ నినాదంతో దేశంలోని రైతాంగాన్ని రక్షించుకుందామని పిలుపునిచ్చారు.
మహారాష్ట్ర భవిష్యత్తుకు నాదీ భరోసా
‘నేను మల్లా సోలాపూర్ వస్తా.. అంతకన్నా వారం ముందు మంత్రి హరీశ్‌రావును అకడికి పంపుత. పెద్ద ఎత్తున ప్రజల భాగస్వామ్యంతో ర్యాలీ తీద్దాం. కనీసం 50 ఎకరాల స్థలంలో భారీ బహిరంగం సభను నిర్వహించుకుందాం. తెలంగాణలో జరిగిన అన్ని రకాల అభివృద్ధిని సోలాపూర్ సహా మహారాష్ట్రలో చేసి చూపించే బాధ్యత నాది. ఇకడకు వచ్చిన వారంతా నా బిడ్డల వంటివారు. మీ భవిష్యత్తుకు భరోసా బీఆర్ఎస్ పార్టీది, నాది. మీరు బీఆర్ఎస్ను గెలిపించుకోండి, మీ జీవితాలను తీర్చి దిద్దే బాధ్యత స్వయంగా నేనే తీసుకుంటా’ అని కేసీఆర్ స్పష్టం చేశారు.
భారీగా చేరికలు
మహారాష్ట్రలోని సోలాపూర్, నాగ్‌పూర్ తదితర ప్రాంతాల నుంచి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పలు పార్టీలకు చెందిన ప్రముఖ నేతలు దాదాపు మూడు వందల మందికిపైగా బీఆర్ఎస్లో చేరారు. నగేశ్ వల్యాల్ (సోలాపూర్ మున్సిపల్ కార్పొరేషన్లో మూడోసారి కార్పొరేటర్), జుగన్భాయ్ అంబేవాలే (రెండోసారి కార్పొరేటర్), సంతోష్ భోంస్లే (కార్పొరేటర్), రాజేశ్వరి చవాన్ (మాజీ కార్పొరేటర్), జయంత్ హోలెపాటిల్ (బీజేపీ ఉద్యోగ్ అఘాడీ అధ్యక్షుడు), సచిన్ సోంటకే (బీజేపీ మాజీ కార్పొరేటర్), భాసర్మర్గల్ (మాజీ కార్పొరేటర్), చేతన్ తుమ్మ, గణేశ్, అరుణ్, నరేశ్, ప్రేమ్, ఓమ్, భాసర్, లక్ష్మణ్, నగేశ్, నాగరాజ్, గోవర్ధన్, శ్రీనివాస్, శ్యామ్, శంకర్ తుమ్మ, రమేశ్, అజయ్, రాజేశ్, రమేశ్, అశోక్, ప్రకాశ్, రాజారామ్ సహా అనేక మంది ప్రముఖులు పార్టీలో చేరారు.
నాగ్‌పూర్ డివిజన్ నుంచి రాజు యెర్నె, స్పోర్ట్స్ క్లబ్ సభ్యుడు నాగార్జున్ మేకల, గోపాల్ గోరంటే, ప్రకాశ్, రామకృష్ణ ప్రభు, శామ్ భాను, భూషణ్కుషే, భూషణ్ మధుకర్‌రావు, వాసుదేవ్ ముక్తి, మహేంద్ర ఠాకూర్, రంగారావు, మమత, బాలా సాహెబ్ దామోదర్, రంగారావు, రూపేశ్ కుమార్ గవాయ్ తదితరులకు సీఎం కేసీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మంత్రి హరీశ్‌రావు ఈ చేరికల కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూదనాచారి, తక్కళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, మాజీ మంత్రి ఎస్ వేణుగోపాలచారి, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు రవీందర్‌సింగ్, సోమా భరత్‌కుమార్, పార్టీ నేతలు కల్వకుంట్ల వంశీధర్‌రావు, బండి రమేశ్, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.
‘కన్నతల్లి తెలంగాణ… పెంచినతల్లి మహారాష్ట్ర’

తెలంగాణ తమకు కన్నతల్లి అయితే మహారాష్ట్ర పెంచినతల్లి అని బీఆర్ఎస్ పార్టీలో చేరిన మహారాష్ట్ర నేతలు పేర్కొన్నారు. చాలామంది దశాబ్దాల క్రితం పొట్ట చేతపట్టుకొని మహారాష్ట్రలోని సోలాపూర్ తదితర ప్రాంతాలకు వలసవెల్లి అక్కడే స్థిరపడ్డారు. వివిధ రంగాల్లో రానిస్తూనే రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఎంతోమంది శనివారం బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు వచ్చారు. తెలంగాణ భవన్‌ను చూసి ముచ్చటపడ్డారు. తెలంగాణ భవన్లో ఉద్యమ ఘట్టాల ఫొటోలు చూసి ఉద్విగ్నతకు లోనయ్యారు. తెలంగాణ రాష్ట్రం కోసం తాము తమతమ ప్రాంతాల్లో పోరాటాలు చేసిన సందర్భాలను గుర్తుచేసుకున్నారు.
పార్టీలో చేరేందుకు ఇంటిల్లిపాదితో వచ్చామని సంబురపడ్డారు. సోలాపూర్, నాగ్‌పూర్ సహా అనేక ప్రాంతాల్లో కార్పొరేటర్లుగా, తాలూకా స్థాయి నేతలుగా వివిధ పార్టీల్లో ఉన్నవారెంతోమంది కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. కేసీఆర్‌తో ఫొటో దిగేందుకు పోటీపడ్డారు. సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని ఆసాంతం ఓపికగా విన్నారు. తెలంగాణను అన్ని రంగాల్లో ఆదర్శంగా ముందు నిలిపినట్టే మహారాష్ట్రనూ తీర్చిదిద్దుతానని సీఎం కేసీఆర్ అన్న సందర్భంలో ‘జై కేసీఆర్… అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’, దేశ్ కీ నేత కైసే హో. కేసీఆర్ జైసే హో’ అనే నినాదాలతో తెలంగాణ భవన్ మారుమోగింది.