హైదరాబాద్ (నమస్తే తెలంగాణ)/న్యూఢిల్లీ: మణిపూర్ అంశంపై చర్చించాల్సిందేనని బీఆర్ఎస్ లోక్‌సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. మణిపూర్ హింసాకాండంపై చర్చించాలని కోరుతూ బుధవారం లోక్‌సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు. సభ ప్రారంభం కాగానే మణిపూర్ అంశంపై అత్యవసరంగా చర్చించాలని బీఆర్ఎస్ ఎంపీలు పట్టుబట్టారు. బీఆర్ఎస్ సభ్యుల ఆందోళనతో స్పీకర్ లోక్‌సభను గురువారానికి వాయిదా వేశారు.
మహిళా బిల్లుపై తీర్మానం
చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎంపీ మాలోతు కవిత లోక్‌సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు. మహిళల రిజర్వేషన్లు బిల్లు వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేశారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిందని గుర్తు చేశారు.
రాష్ర్టాలవారీ కేటాయింపులు ఉండవు
వస్త్ర పరిశ్రమకు సంబంధించి కేంద్రం అమలుచేస్తున్న వివిధ పథకాలకు నిధుల కేటాయింపు రాష్ర్టాలు, జిల్లాల వారీగా ఉండదని కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి దర్శనా జర్దోశ్ పేర్కొన్నారు. తెలంగాణలో వస్త్ర పరిశ్రమకు కేంద్రం విడుదల చేసిన నిధులు, అమలవుతున్న పథకాల వివరాలు ఇవ్వాలని పార్లమెంటులో బీఆర్ఎస్ ఎంపీలు వెంకటేష్ నేత, జీ రంజిత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి ఈ మేరకు సమాధానమిచ్చారు. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ర్టానికి, జిల్లాలకు ఏ మేరకు నిధులు కేటాయించామనే వివరాలు లేవన్నారు.
రాజ్యసభలో విపక్షాల వాకౌట్
మణిపూర్ అంశంపై చర్చకు కేంద్రం అంగీకరించకపోవడంతో నిరసనగా విపక్షాలు రాజ్యసభలో వాకౌట్ చేశాయి. ప్రభుత్వం అటవీ సంరక్షణ(సవరణ) బిల్లు, జన్‌విశ్వాస్ బిల్లు, మైన్స్, మినరల్స్ సవరణ బిల్లులను కేంద్రం ఆమోదించుకొన్నది. మరోవైపు ఇండియా కూటమి నేతలు రాష్ట్రపతి ముర్మును కలిశారు. మణిపూర్ అంశంపై జోక్యం చేసుకోవాలని, ప్రధాని మోదీ సమాధానమిచ్చేలా సూచన చేయాలని కోరారు.