న్యూఢిల్లీ, జూలై 24(నమస్తే తెలంగాణ): మణిపూర్‌లో జరుగుతున్న దారుణాలను అడ్డుకోవాలని, ఆ రాష్ట్రంలో శాంతి నెలకొల్పేందుకు ప్రయత్నించాలని బీఆర్ఎస్ ఎంపీలు సోమవారం కూడా పార్లమెంట్లో ఆందోళన కొనసాగించారు. మణిపూర్ అంశంపై తక్షణమే చర్చించాలంటూ లోక్‌సభలో బీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు వాయిదా తీర్మానం ఇచ్చారు. బీఆర్ఎస్తోపాటు అన్ని ప్రధాన పార్టీల సభ్యులు చర్చకు పట్టుబట్టినప్పటికీ కేంద్రం పట్టించుకోకపోవడంతో ఎంపీలు నిరసన వ్యక్తంచేశారు. సభ్యుల నినాదాలతో సభ హోరెత్తింది. దీంతో లోక్‌సభ స్పీకర్ ఓంబిర్ల సభను తొలుత ఉదయం 12 గంటలకు వాయిదా వేశారు. ఆ తరువాత కూడా సభ్యుల ఆందోళనలు కొనసాగడంతో మధ్యాహ్నం 2 గంటల వరకు మరోసారి సభను వాయిదా వేశారు. ఆ తరువాత కూడా సభ్యులు పట్టువీడకపోవడంతో సభను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. మరోవైపు రాజ్యసభలో కూడా మణిపూర్‌పై చర్చించాలని బీఆర్ఎస్తోపాటు ఇతర పార్టీల ఎంపీలు డిమాండ్ చేశారు.
మణిపూర్‌పై కేంద్రం వ్యవహరిస్తున్న తీరు అత్యంత దారుణంగా ఉన్నదని, ఇది ఆక్షేపణీయమని పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు మండిపడ్డారు. సభ వాయిదాపడిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్‌సింగ్‌ను రాజ్యసభ నుంచి సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ఎంపీలందరూ పార్లమెంటు ఆవరణలో నిరసనకు దిగారు. ఉదయం నుంచి రాత్రి వరకు నిరసన కొనసాగింది. బీఆర్ఎస్ ఎంపీలు కే కేశవరావు, నామా నాగేశ్వరరావు, సంతోష్‌కుమార్, దీవకొండ దామోదర్‌రావు, కేఆర్ సురేశ్‌రెడ్డి, బడుగుల లింగయ్యయాదవ్, వెంకటేశ్ నేత, పసునూరి దయాకర్, బండి పార్థసారథి, రంజిత్‌రెడ్డి తదితరులు సంజయ్‌సింగ్‌కు మద్దతుగా పార్లమెంటు ఆవరణలో జరిగిన నిరసన దీక్షలో పాల్గొన్నారు.
కేంద్రంలోని బీజేపీ సర్కారు తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. సభ నుంచి అకారణంగా సభ్యుడిని సస్పెండ్ చేయడం బీజేపీ నిరంకుశ విధానాలకు నిదర్శనమని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఇలా చేయడం సరికాదని బీజేపీకి హితవు చెప్పారు. సస్పెన్షన్‌ను తక్షణమే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలు చర్చకు పట్టుబడితే ప్రభుత్వం పారిపోయిందని, ఒకవైపు మణిపూర్ రావణకాష్టంలా రగులుతుంటే కేంద్రం ప్రేక్షకపాత్ర పోషించడం దారుణమని నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు.