న్యూఢిల్లీ: అదానీ(Adani) సంస్థలపై హిండెన్‌బర్గ్(Hindenberg) ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఆ కంపెనీపై దర్యాప్తు చేపట్టాలని ఇవాళ బీఆర్ఎస్(BRS) డిమాండ్ చేసింది. పార్లమెంట్లో ఇవాళ ఉభయసభల్లోనూ బీఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మానం(adjournment motion) ఇచ్చింది. రూల్ 267 కింద రాజ్యసభలో చర్చ చేపట్టాలని చైర్మన్ ధన్కర్ను ఎంపీ కేశవరావు(Kesava rao) కోరారు. ప్రశ్నోత్తరాలను వాయిదా వేసి.. అదానీపై జేపీసీ(JPC) వేయాలన్న అంశాన్ని డిస్కస్ చేయాలని ఆయన తన లేఖలో తెలిపారు.
ఇక లోక్‌సభలోనూ ఇదే అంశంపై చర్చ చేపట్టాలని బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు(Nama Nageshwara rao) డిమాండ్ చేశారు. ప్రశ్నోత్తరాలను నిలిపివేసి.. అదానీ అంశంపై చర్చ చేపట్టాలని ఆయన తన వాయిదా తీర్మానంలో కోరారు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల(budget session)కు చెందిన రెండో దఫా సోమవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. తొలి రోజు కూడా బీఆర్ఎస్ నేతలు వాయిదా తీర్మానం ఇచ్చారు. అదానీ వ్యవహారంపై చర్చించాలని లోక్‌సభ, రాజ్యసభలోనూ కోరారు. ఈడీ(ED), సీబీఐ(CBI)లను దుర్వినియోగం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎంపీలు ఆరోపించారు. పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు ధర్నా చేపట్టిన విషయం తెలిసిందే.