అభియోగం పోటీలేకుండా సోలార్ కాంట్రాక్ట్‌ల కోసం అధికారులకు భారీ ఎత్తున లంచాలు
ఎవరిపై? గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్‌తో పాటు మరో ఆరుగురు (వినీత్ జైన్, రంజిత్ గుప్తా, సైరిల్ కబానిస్, సౌరబ్ అగర్వాల్, దీపక్ మల్హోత్రా, రూపేశ్ అగర్వాల్)
ఎంత లంచం? 2,238 కోట్లు…
లంచం డబ్బు కోసం అమెరికాలో బ్యాంకులు, ఇన్వెస్టర్లకు బురిడీ
ఏ రాష్ర్టాల అధికారులపై అభియోగాలు! ఏపీ, ఒడిశా, తమిళనాడు, జమ్ముకశ్మీర్, ఛత్తీస్‌గఢ్
Adani | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): భారత కుబేరుడు, అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదైంది. యూఎస్ కోర్టు ఆయనపై అరెస్టు వారెంట్ కూడా జారీ చేసింది. మోసం, లంచం ఆరోపణలపై ఈ వారెంట్ జారీ చేశారు. భారత్‌లో సోలార్ పవర్ ప్రాజెక్టులు దక్కించుకోవడానికి అదానీ గ్రూప్.. వివిధ రాష్ర్టాల్లోని ఉన్నతాధికారులకు 265 మిలియన్ డాలర్లు (రూ. 2,238 కోట్లు) లంచంగా ఇవ్వజూపినట్టు న్యూయార్క్‌లోని ఫెడరల్ కోర్టులో అభియోగాలు నమోదయ్యాయి. ఇదే విషయమై ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారానికి సంబంధించి గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు, అదానీ గ్రీన్ ఎనర్జీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ సాగర్ అదానీతో పాటు మరో ఆరుగురిపై కేసులు నమోదవ్వడమే గాకుండా అరెస్టు వారెంట్ కూడా జారీ అయినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ప్రపంచ దేశాలు పునరుత్పాదక శక్తి రంగంవైపు అడుగులు వేస్తున్న క్రమంలో సౌర విద్యుత్తు రంగంలో పెద్దయెత్తున పెట్టుబడులు పెట్టాలని అదానీ గ్రూప్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా భారత్‌లో భారీ సోలార్ ఎనర్జీ ప్రాజెక్టులు చేపట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ క్రమంలో ఎలాంటి పోటీ లేకుండా కాంట్రాక్ట్ టెండర్లను దక్కించుకొనేందుకు ఏపీ, ఒడిశా, తమిళనాడు, జమ్ముకశ్మీర్, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల్లోని ఉన్నతాధికారులకు అదానీ గ్రూప్ ప్రతినిధులు రూ. 2,238 కోట్ల మేర లంచాలు ఆఫర్ చేసినట్టు అమెరికా ఎఫ్‌బీఐ తన ఆరోపణల్లో వెల్లడించింది. తద్వారా వచ్చే 20 ఏండ్లలో కనిష్ఠంగా 2 బిలియన్ డాలర్లు లబ్ధి పొందేందుకు అదానీ గ్రూప్ ప్రణాళిక సిద్ధం చేసినట్టు ఆరోపించింది. ఈ లంచం సొమ్మును సేకరించడానికి బ్యాంకులు, పెట్టుబడిదారులకు తప్పుడు సమాచారం ఇచ్చి మోసపుచ్చే ప్రయత్నాలు చేసినట్టు తెలిపింది. అమెరికా ఫెడరల్ కోర్టులో అదానీకి సంబంధించి ముఖ్యంగా రెండు అభియోగాలు నమోదైనట్టు అంతర్జాతీయ పత్రిక రాయిటర్స్ వెల్లడించింది. అందులో ఒకటి.. తప్పుడు సమాచారం చూపించి 2 బిలియన్ డాలర్ల మేర రుణాలకు అర్జీ పెట్టడం కాగా రెండోది.. అంతర్జాతీయ ఫైనాన్షియల్ సంస్థలు ఇచ్చిన భరోసాను చూపించి అమెరికాతో పాటు ఇతర దేశాల్లోని మదుపర్లకు 1 బిలియన్ డాలర్ల విలువైన బాండ్లను ఆఫర్ చేయడం. ఈ రెండు అభియోగాలపై న్యూయార్క్‌లోని యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ కోర్టు అదానీ సహా ఏడుగురికి నోటీసులు జారీ చేసింది. మరోవైపు, ఫెడరల్ సెక్యూరిటీ చట్టాలను ఉల్లంఘించిన కారణంగా గౌతమ్ అదానీ, సాగర్ అదానీతో పాటు ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న అజురా పవర్ అనే కంపెనీకి కూడా ఇదే కేసులో తాము నోటీసులు పంపించినట్టు యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ కమిషన్ (ఎస్ఈసీ) ఒక ప్రకటనలో వెల్లడించింది. కాగా, ఈ కేసులో నిందితులు ఎఫ్‌బీఐ, ఎస్ఈసీ దర్యాప్తును అడ్డుకోవడానికి కుట్ర పన్నినట్టు కోర్టు ఈ సందర్భంగా పేర్కొనడం గమనార్హం.
అదానీ గ్రూప్ తాజా వ్యవహారం అమెరికాలోని ఫారెన్ కరప్ట్ ప్రాక్టిసెస్ యాక్ట్ (ఎఫ్‌సీపీఏ) చట్టం ఉల్లంఘన కిందకే వస్తుందని అక్కడి న్యాయకోవిదులు చెప్తున్నారు. అమెరికా కంపెనీలు, వ్యక్తులు విదేశాల్లో అవినీతి పనుల్లో భాగం కాకుండా చూడటమే ఈ చట్టం లక్ష్యం. ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే అమెరికాలో తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు.
తమపై వచ్చిన ఆరోపణలను అదానీ గ్రూప్ ఖండించింది. అమెరికా ప్రాసిక్యూటర్లు చేస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమైనవని, దీనిపై న్యాయపరంగానే ముందుకు వెళ్తామని వెల్లడించింది. దోషులుగా రుజువయ్యేవరకూ నిందితులను నిర్దోషులుగానే చూడాల్సి ఉంటుందని పేర్కొంది. చట్టాలను గౌరవిస్తూ, వాటికి లోబడి నడుచుకొంటున్నట్టు ఉద్ఘాటించింది.
అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్, ఎస్ఈసీ అభియోగాల నేపథ్యంలో.. అమెరికా డాలర్ డినామినేటెడ్ బాండ్ ఆఫరింగ్‌లో ముందుకు వెళ్లకూడదని నిర్ణయించుకొన్నట్టు అదానీ గ్రూప్‌కు చెందిన అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ తెలిపింది. ఈ మేరకు ఈ విషయాన్ని గురువారం స్టాక్ మార్కెట్‌కు అందజేసిన ఫైలింగ్‌లో వెల్లడించింది. ఈ ఆఫర్ విలువ 600 మిలియన్ డాలర్లుగా ఉన్నట్టు పారిశ్రామిక నిపుణులు వెల్లడించారు. కాగా అదానీ ఎంటర్ప్రైజెస్ 20 వేల కోట్ల ఎఫ్‌పీవోకు వెళ్లే సమయంలోనే జనవరి 25, 2023లో హిండెన్‌బర్గ్.. అదానీ గ్రూప్‌పై అవినీతి ఆరోపణలు చేయడం గమనార్హం. దీంతో ఆ ఎఫ్‌పీవోను కంపెనీ రద్దు చేసుకొంది.
అదానీ గ్రూప్ అక్రమాలు నిజమేనని తేలితే ఎఫ్‌సీపీఏ చట్టం ప్రకారం.. గౌతమ్ అదానీకి ఐదేండ్ల జైలు శిక్షతో పాటు 2 మిలియన్ డాలర్ల జరిమానా విధించవచ్చు. ఈ మేరకు 2008నాటి సీమెన్స్ ఏజీ, 2012లో ఎలీలిల్లీ ఫార్మా కంపెనీ తదితర కేసులను నిపుణులు ఉదహరిస్తున్నారు.
22 నెలల కిందట అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రిసెర్చ్ సంస్థ అదానీ గ్రూప్ కంపెనీల్లో స్టాక్ మ్యానిప్యులేషన్ జరిగినట్టు సంచలన ఆరోపణలు చేసింది. షెల్ కంపెనీలను సృష్టించి షేర్ ముఖ విలువలను పెంచారని అభియోగాలు నమోదు చేసింది. దీనిపై అమెరికాలోని బ్రూక్లిన్ జిల్లా కోర్టులో ఇంకా విచారణ కొనసాగుతున్నది. కేసు పూర్వాపరాలను పరిశీలించిన కొందరు న్యాయవాదులకు సోలార్ ఎనర్జీ కాంట్రాక్టు టెండర్లలోనూ అక్రమాలు జరిగినట్టు అనుమానాలు వచ్చాయి. దీంతో వాళ్లు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు అక్కడి స్థానిక మీడియా వెల్లడించింది.
ఎఫ్‌బీఐ తాజాగా పేర్కొన్న రెండు అభియోగాల్లో ఎనిమిది మంది కీలక నిందితుల్లో నలుగురికి అమెరికా పౌరసత్వం ఉన్నట్టు తెలుస్తున్నది. అంతేకాకుండా ఈ స్కామ్‌లో అమెరికా ఇన్వెస్టర్ల నిధులు కూడా ఉన్నాయి. ఎస్ఈసీ నోటీసులు జారీ చేసిన అజురా పవర్ కంపెనీ న్యూయార్క్ స్టాక్ ఎక్సేంజీలో (ఎన్వైఎస్ఈ) లిస్ట్ అయ్యి ఉన్నది. ఈ క్రమంలోనే ఈ కేసు విచారణను అమెరికా కోర్టు ప్రారంభించింది.
గౌతమ్ అదానీపై అమెరికాలో నమోదైన నేరారోపణలు రుజువైతే ఆయన్ని భారత్.. అమెరికాకు అప్పగిస్తుందా? అనే చర్చ పెద్దయెత్తున జరుగుతున్నది. ఇండియా-అమెరికా మధ్య వాషింగ్టన్లో జూన్ 25, 1997లో నేరస్తుల అప్పగింత ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం.. అమెరికాలో నమోదైన అభియోగాలు నిరూపితమైతే నిందితులు అక్కడే శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో నేరం రుజువైతే అదానీని అమెరికాకు భారత్ అప్పగించాల్సి వస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.