IOC | న్యూఢిల్లీ: ‘ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్’ (ఐవోసీ) నుంచి కాంట్రాక్ట్ దక్కించుకునేందుకు అమెరికా రసాయన ఉత్పత్తుల కంపెనీ లంచాలు ఇచ్చిందన్న ఆరోపణలు భారత్లో కలకలం రేపాయి. దీనిపై ఐవోసీ నిజ నిర్ధారణకు సిద్ధమైంది. ‘2009లో జరిగిట్లుగా భావిస్తున్న ఘటనకు సంబంధించి అంతర్గత నిజనిర్ధారణ సమీక్షను ఐవోసీ ప్రారంభించింది. ఆరోపణల చుట్టూ ఉన్న వాస్తవాలను అర్థం చేసుకోవడానికి, తీసుకోవలసిన తగిన చర్యలను నిర్ణయిస్తాం’ అని ఐవోసీ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నది.
ఐవోసీ చట్టబద్ధమైన, పారదర్శక పాలనకు కట్టుబడి ఉందని తెలిపింది. సుమారుగా 15 ఏండ్ల క్రితం అమెరికా కంపెనీ ‘ఆల్బెమార్లే కార్పొరేషన్’ ఐవోసీ అధికారులకు లంచాలు ఇచ్చి, కాంట్రాక్ట్లు పొందారన్నది ప్రధాన ఆరోపణ. దీనిపై అమెరికాలో 2017లో కేసు నమోదుకాగా..సెప్టెంబర్ 2023న ‘ఆల్బెమార్లే కార్పొరేషన్’ కంపెనీ సెటిల్మెంట్ చేసుకుంది.
198 మిలియన్ డాలర్లు (రూ.1682కోట్లు) జరిమానా చెల్లించింది. 2009 నుంచి 2011 మధ్యకాలంలో ‘ఆల్బెమార్లే కార్పొరేషన్’ కంపెనీ ఏజెంట్స్ ఐవోసీ అధికారులకు 1.14 మిలియన్ డాలర్లు (రూ.9.6 కోట్లు) లంచాలు ఇచ్చారన్న విషయం, అమెరికాలో కేసు సెటిల్మెంట్ అయిన సంగతి ఇటీవలే వెలుగులోకి వచ్చింది.