EMI | అహ్మదాబాద్: వస్తువులు కొనుగోలు, రుణాలకేనా ఈఎంఐలు ఉండేది.. లంచానికి ఉండొద్దా! అనుకున్నారేమో గుజరాత్ అధికారులు.. వెంటనే ఈఎంఐ పథకాన్ని ప్రవేశపెట్టి బాధితులపై ఒకేసారి ఆర్థికభారం పడకుండా ‘మంచి మనసు’ చాటుకొంటున్నారు.
ఎస్జీఎస్టీ బోగస్ బిల్లింగ్ కుంభకోణంలో ఓ వ్యక్తి నుంచి రూ.21 లక్షలు డిమాండ్ చేసిన అధికారులు బాధితుడిపై కరుణాకటాక్షాలు ప్రదర్శించారు. అంతసొమ్ము ఒక్కసారిగా చెల్లించడం కష్టమని భావించి దానిని ఈఎంఐలుగా విభజించి ప్రతినెలా రూ. 2 లక్షల చొప్పున చెల్లించాలని ఆదేశించారు. మిగిలిన రూ. 3 లక్షలను చివరి మూడు నెలల్లో నెలకు రూ. లక్షల చొప్పున చెల్లించాలని చెప్తూ తమ ఉదారతను చాటుకున్నారు.
వాయిదాల్లో ముడుపులు
ఏప్రిల్ 4న సూరత్‌లోని ఓ గ్రామంలో భూ వివాదానికి సంబంధించి డిప్యూటీ సర్పంచ్, తాలూకా పంచాయతీ సభ్యుడు బాధితుడి నుంచి రూ. 85 వేల లంచం డిమాండ్ చేశాడు. అయితే, ఆ తర్వాత అతడి ఆర్థిక పరిస్థితికి కరిగిపోయి ఆ మొత్తాన్ని రూ.35 వేల చొప్పున మూడు ఇన్స్టాల్మెంట్లుగా విభజించి భారం దించాడు.
ఇటీవల ఇద్దరు పోలీసులు రూ. 4 లక్షల లంచంతో పట్టుబడ్డారు. విచారణలో తేలింది ఏంటేంటే.. ఆ మొత్తం రూ.10 లక్షల లంచానికి సంబంధించి మొదటి ఇన్స్టాల్మెంట్ అని. మరో కేసులో సైబర్ క్రైం పోలీసు రూ. 10 లక్షల లంచాన్ని నాలుగు ఇన్స్టాల్మెంట్లుగా విభజించాడు. ఇలాంటి లంచం ఇన్స్టాల్మెంట్ కేసులు ఈ ఏడాది విపరీతంగా పెరిగినట్టు ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.
కేసు విషయంలో పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కినా, ప్రభుత్వ పథకం కోసం కార్యాలయాలకు వెళ్లినా సామాన్యుడి నుంచి ముక్కుపిండి మరీ లంచం వసూలు చేస్తున్నారు. చెల్లించుకోలేని పరిస్థితుల్లో ఉన్నవారికి ఇలాంటి స్కీములు ఆఫర్ చేస్తున్నారని గుజరాత్ ఏసీబీ డైరెక్టర్ శంషేర్‌సింగ్ తెలిపారు. బాధితులు కొందరు కొంతమొత్తాన్ని చెల్లించిన తర్వాత మాత్రమే తమను ఆశ్రయిస్తున్నట్టు తెలిపారు.
దేశవ్యాప్తంగా చర్చ
గుజరాత్ వాటర్ సైప్లె, సీవరేజ్ బోర్డులోని క్లాస్ 2 అధికారి ఒకరు ఓ కాంట్రాక్టర్ ఇన్వాయిస్లు క్లియర్ చేసేందుకు రూ. 1.2 లక్షలు డిమాండ్ చేసి దానిని నెలకు రూ. 30 వేల చొప్పున నాలుగు ఇన్స్టాల్మెంట్లుగా విభజించాడు. అవినీతి అధికారుల ఇన్స్టాల్మెంట్ల వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతున్నది.