Congress Govt | న్యూఢిల్లీ, మార్చి 5 : కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటక రాష్ట్రంలో ధరాఘాతానికి సామాన్యులే కాదు వ్యాపార వర్గాలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. వ్యాపార వర్గాలను కూడా సిద్ధరామయ్య ప్రభుత్వం విభజించి తమ వారికి రాయితీలు, ప్రయోజనాలు కల్పిస్తూ, వేరే వారిని ముప్పుతిప్పలు పెడుతున్నది. ఇది వ్యాపారుల్లో చీలికకు దారితీస్తున్నది. ముఖ్యంగా బీరు వ్యాపార సంస్థలపై ఏకపక్షంగా విధించిన నిబంధనలు, రాష్ట్రంలో తరచూ పన్నుల పెంపుపై బ్రూవరీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బీఏఐ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత్‌లోని మొత్తం బీరులో 85 శాతం తయారు చేసే ఏబీ ఇన్బేవ్, కార్ల్స్‌బెర్గ్, యునైటెడ్ బ్రూవరీస్‌కు ప్రాతినిధ్యం వహించిన బీఏఐ ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వానికి వారి తరపున ఒక లేఖ రాసింది.
రాష్ట్రంలో బీరు అమ్మకాలపై తరచూ పన్నులు పెంచుకుంటూ పోతుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. అలాంటి చర్యల వల్ల వినియోగదారులకు తమ ఉత్పత్తులు అందకుండా పోయే అవకాశం ఉందని పేర్కొంది. కొన్ని లేబుళ్లకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలను కూడా ప్రస్తావించింది. దీని కారణంగా కర్ణాటకలో ఉత్పత్తి కష్టతరంగా మారుతున్నదని తెలిపింది. ప్రభుత్వం అన్ని ఉత్పత్తులపై ఏకరీతిన నిబంధనలు విధించడం లేదన్న విషయాన్ని తాము గుర్తించామన్నది.