Vaishno Devi Temple | జమ్మూకశ్మీర్లోని ప్రముఖ శ్రీమాతా వైష్ణోదేవి ఆలయంలో భద్రతా వైఫల్యం ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ భద్రతా సిబ్బంది కళ్లుగప్పి ఆలయంలోకి తుపాకీతో ప్రవేశించింది. ఈ ఘటన ఈ నెల 15న జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సదరు మహిళ వద్ద గన్ను గుర్తించిన అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమె వద్ద నుంచి తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. సదరు మహిళను ఢిల్లీకి చెందిన జ్యోతి గుప్తాగా గుర్తించారు. ఆమె గడువు ముగిసిన లైసెన్స్డ్ తుపాకీతో ఆలయంలోకి వచ్చారని.. ఆమెపై కత్రా పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటన ఒక్కసారిగా అందరికీ షాక్ గురి చేసింది. అయితే, ఆమె ఢిల్లీ పోలీసు విభాగంలో పని చేస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే, ఈ ఘటనపై ఎస్ఎస్పీ పర్మీందర్ సింగ్ స్పందించారు. సదరు మహిళా ఢిల్లీ పోలీసు విభాగంలో పని చేయడం లేదని స్పష్టం చేశారు. ఆయుధ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.