Wrestlers Protest | భారత రెజ్లింగ్ ఫెడరేషన్ (WFI) అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ లైంగిక వేధింపులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేలా ఢిల్లీ పోలీసులను ఆదేశించాలని రెజ్లర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం మరోసారి విచారణ జరిపింది. బ్రిజ్ భూషణ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నట్లు ఢిల్లీ పోలీసులు సుప్రీంకోర్టుకు తెలిపారు. సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం పిటిషన్‌పై విచారణ జరిపింది.
ఈ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పోలీసుల తరఫున వాదనలు వినిపించారు. శుక్రవారం తప్పనిసరిగా ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నట్లు పేర్కొన్నారు. లైంగిక వేధింపుల నేపథ్యంలో బ్రిజ్ భూషణ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ రెజ్లర్లు జంతర్‌మంతర్ వద్ద నిరసన చేపడుతున్న విషయం తెలిసిందే. నిరసన చేపట్టినా పోలీసులకు స్పందించకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 25న పిటిషన్‌ను విచారణకు సుప్రీంకోర్టు స్వీకరించింది. రెజ్లర్లు లేవనెత్తిన ఆరోపణలు తీవ్రమైనవన్న సర్వోన్నత న్యాయస్థానం వాటిని పరిగణలోకి తీసుకోవాలని పేర్కొంది.
అయితే, ఈ కేసులో ఏదైనా ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ముందు ప్రాథమిక విచారణ అవసరమని ఎస్జీ తుషార్ మహతా 26న విచారణ సందర్భంగా సుప్రీంకోర్టుకు తెలిపారు. విచారణను రిటైర్డ్ జడ్జి పర్యవేక్షణలో జరగాలని పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ పేర్కొన్నారు. ఆరోపణలు చేసింది దేశం కోసం ఆడుతున్న అమ్మాయిలని, రిటైర్డ్ జడ్జితో విచారణ కోసం అంగీకరించాలని సుప్రీంకోర్టును కోరారు. ఈ మేరకు పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.