చెన్నై: తమిళనాడులో తమిళగ వెట్రి కజగం పార్టీ(TVK Party) .. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో 108 సీట్లతో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దమైంది. అయితే డీఎంకే, అన్నాడీఎంకే లాంటి ద్రావిడ్ పార్టీలకు టీవీకే అనూహ్యంగా షాక్ ఇచ్చింది. టీవీకే చీఫ్ విజయ్ తన పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించారు. చాలా చాకచక్యంగా ఆయన సీట్లను కేటాయించారు. కుల సమీకరణల్లో కొత్త పంథాను అనుసరించారు. డీఎంకే, అన్నాడీఎంకేను నియంత్రించడంలో విజయ్ పార్టీ అనుసరించిన వ్యూహం ఆ పార్టీకి విజయాన్ని కట్టబెట్టింది. తమిళనాడు అంటేనే టెంపుల్ కల్చర్‌కు పెట్టింది పేరు. కానీ ఆ రాష్ట్రంలో కొన్ని చోట్ల బ్రాహ్మణ ఆధిపత్యం.. కొన్ని చోట్ల ఎస్సీల ఆధిపత్యం ఉన్నది. అయితే భౌగోళికంగా ఆ సమస్యను విజయ్ పార్టీ చాలా వ్యూహాత్మకంగా ఎదుర్కొన్నది. కుల గణాంకాలకు తగిటన్లు సీట్లు పంచిన విజయ్ అనుకున్నట్లు హీరో అయ్యారు.
తమిళనాడులో మొత్తం 44 ఎస్సీ, రెండు ఎస్టీ స్థానాలు రిజర్వడ్ కేటగిరీలో ఉన్నాయి. అయితే విజయ్ పార్టీ ఆ కోటాను సక్రమంగా వాడుకున్నది. సామాజిక న్యాయం సిద్ధాంతాన్ని వినిపించిన విజయ్.. దానికి తగినట్లు కొన్ని ప్రాంతాల్లో తమ పార్టీలో బ్రాహ్మణులకు సీట్లు కేటాయించారు. అసెంబ్లీలో వారి ప్రాతినిధ్యానికి ప్రాముఖ్యత ఇవ్వాలన్న తన నిర్ణయాన్ని ఆయన ధైర్యంగానే వ్యక్తం చేశారు. కానీ ద్రావిడ పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకేలు అగ్రకులానికి సీట్లు కేటాయించడంలో కొంత వరకు భయపడ్డాయి. అయితే విజయ్ పార్టీ రెండు స్థానాల్లో బ్రహ్మణులకు సీట్లు కేటాయించి కీలక స్థానాలను చేజిక్కించుకున్నారు.
క్రైస్తవ మతాన్ని పాటించే టీవీకే చీఫ్ సీ జోసెఫ్ విజయ్.. ఎస్సీ రిజర్వడ్ స్థానాల్లో తన ప్లాన్‌ను పక్కాగా అమలు చేశారు. ఎస్సీ, ఎస్టీ మెజారిటీ స్థానాలను ఆ పార్టీ గెలుచుకున్నది. స్థానికంగా సామర్థ్యం ఉన్న వ్యక్తులకు ఆ సీట్లు కేటాయించి .. డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల్లోని హేమాహేమీ నేతలను మట్టికరిపించారు. ముస్లిం కమ్యూనిటీకి కూడా విజయ్ అవకాశం ఇచ్చారు. మైలాపూర్, శ్రీరంగం నుంచి బ్రహ్మణ కులస్థులు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. మైలాపూర్‌లో పీ వెంకటరామనన్, శ్రీరంగం నుంచి రమేశ్ ఎన్నిక కావడం .. రాజకీయంగా పెను మలుపుగా తమిళ నేతలు భావిస్తున్నారు. గతంలో ద్రావిడ పార్టీలు బ్రాహ్మణులకు సీట్లు ఇచ్చేందుకు భయపడేవి, కానీ టీవీకే చాలా తెలివిగా సీట్లను కేటాయిచింది. ఒక రకంగా విజయ్ పార్టీ ప్రస్తుతం ఉన్న టికెట్ల కేటాయింపు ప్రక్రియను సమూలంగా మార్చివేసిందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
234 అసెంబ్లీ స్థానాలు ఉన్న తమిళనాడులో.. 46 సీట్లు రిజర్వ్డ్ స్థానాలు ఉన్నాయి. దీంట్లో టీవీకే 24 సీట్లను గెలుచుకున్నది. ఆ పార్టీ విజయంలో ఈ సీట్లు చాలా కీలకంగా మారాయి. ఇక మిగితా 22 సీట్లలో డీఎంకే(13), అన్నాడీఎంకే(9) కూటమిలకు దక్కాయి. రిజర్వడ్ మాత్రమే కాదు, ఇతర స్థానాల్లో కూడా కొందరు ఎస్సీలు గెలిచారు. ఇది నిజంగా టీవీకేకు కలిసి వచ్చే అంశం. విరుదానగర్లో ఎస్సీ అభ్యర్థి పీ సెల్వమ్.. అనూహ్య రీతిలో వీ విజయ్ ప్రబాహరన్పై గెలుపొందారు. ఈ విక్టరీ కుల సమీకరణల్లో కొత్త కోణాన్ని ప్రదర్శించింది.
తాజా ఫలితాలతో ఓటర్ల బిహేవియర్ మారినట్లు స్పష్టంగా తెలుస్తోందని మైలాపూర్ ఎమ్మెల్యే పీ వెంకటరమణన్ అన్నారు. గతంలో బ్రాహ్మనిజం అంటే ఆధిపత్యం, వివక్ష అన్న భావన ఉండేదని, అవన్నీ గత సమస్యలు అని, కానీ నేటి యువత చాలా వరకు జాగృతం అయ్యారని, పని ఆధారంగా వ్యక్తులను ఎన్నుకుంటారని, టికెట్ల పంపకంలో ఎటువంటి వివక్ష జరగలేదని, మహిళలు.. మైనార్టీలకు కూడా టికెట్లు ఇచ్చామని టీవీకే ట్రెజరర్, ఎమ్మెల్యే వెంకటరమణన్ తెలిపారు.
టీవీకే టికెట్‌పై రిజర్వడ్ , జనరల్ నియోజకవర్గాల్లో పోటీ చేసిన అణగారిన వర్గాలకు చెందిన అభ్యర్థులు విజయం సాధించారు. ఈ గెలుపు కుల, మత సమీకరణలను మార్చివేసిందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. విభిన్నమైన బ్యాక్‌గ్రౌండ్ ఉన్న కమ్యూనిటీలకు వ్యూహాత్మకంగా పార్టీ టికెట్లు కేటాయించింది. అయితే పార్టీ వ్యూహానికి తగినట్లే ఓటర్లు కూడా పోటెత్తారు. విజయ్ పార్టీకి మద్దతు పలికారు.
తమిళనాడు డెల్టా ప్రాంతంలో గతంలో డీఎంకే ఆధిపత్యం ఉండేది. డెల్టా ప్రాంతంలో సుమారు 41 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అయితే విజయ్ పార్టీ 12 స్థానాలు చేజిక్కించుకోవడం ఆ పార్టీకి బాగా కలిసివచ్చింది. గతంలో డీఎంకే ఇక్కడ 37 స్థానాలు గెలిచింది. అయితే పెద్దగా బ్యాక్‌గ్రౌండ్ లేని వ్యక్తులు .. ఈ ప్రాంతం నుంచి టీవీకే టికెట్‌పై నెగ్గడం గమనార్హం.