చెన్నై : తమిళనాడులోని ఓ ఆస్పత్రిలో బాలుడు పేపర్ కప్‌ను ఆక్సిజన్ మాస్క్‌గా ఉపయోగించిన వీడియో ఆందోళన రేకెత్తిస్తోంది. రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో మౌలిక వసతుల కొరత ఏ స్ధాయిలో ఉందో ఈ ఘటన వెల్లడిస్తోంది. ప్రాధమిక దర్యాప్తులో వెలుగుచూసిన వివరాల ప్రకారం గత వారం కాంచీపురం జిల్లాలోని ఉధిరమెరూర్ ప్రభుత్వ ఆస్పత్రికి శ్వాస సమస్యతో బాధపడుతూ ఓ బాలుడు వచ్చాడు. ఆస్పత్రిలో బాలుడికి ఆక్సిజన్ మాస్క్ స్ధానంలో పేపర్ కప్ అమర్చడం విమర్శలకు తావిచ్చింది.
ఈ వీడియో వైరల్ కావడంతో నర్సుతో పాటు డ్యూటీ డాక్టర్‌పై ఫిర్యాదులు నమోదయ్యాయి. ఈ తరహా ఘటనలు పునరావృతం కారాదని సంబంధిత సిబ్బందిని వైద్య సేవల సంచాలకులు డాక్టర్ షణ్ముగఖని హెచ్చరించారు. సమగ్ర దర్యాప్తు జరిపిన అనంతరం తదుపరి చర్యలు చేపడతామని ఆమె పేర్కొన్నారు. కాగా ఆస్పత్రుల్లో తగినన్ని ఆక్సిజన్ మాస్క్‌లు ఉన్నాయని తమిళనాడు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణియన్ చెప్పారు.
జులై 27న జరిగిన ఘటనలో వైద్యుల నిర్లక్ష్యం లేదని, బాలుడికి ఆక్సిజన్ మాస్క్‌ను నర్సు అందించగా ఇతర రోగులకు కూడా మాస్క్‌ను వాడినందున ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉందంటూ బాలుడి తండ్రి నిరాకరించాడని మంత్రి తెలిపారు. కొవిడ్-19 ఇన్ఫెక్షన్ సోకినప్పుడు కూడా తాను పేపర్ కప్ వాడినట్టు బాలుడి తండ్రి చెప్పాడని అన్నారు. బాలుడి తండ్రి వీడియో కూడా రికార్డు చేయడంతో ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందని తెలుస్తోందని మంత్రి పేర్కొన్నారు.
Read More :
Hyderabad | గే యాప్ ద్వారా వల.. అమాయకపు యువకులతో ఆడుకుంటున్న రౌడీ షీటర్